కుప్టి ప్రాజెక్ట్ నిర్మిస్తే కడెం సేఫ్.. పట్టించుకోని ప్రభుత్వం

by samatah |
కుప్టి ప్రాజెక్ట్ నిర్మిస్తే కడెం సేఫ్.. పట్టించుకోని ప్రభుత్వం
X

దిశ, ఇచ్చోడ : చుట్టూ రెండు వైపుల ఎత్తైన కొండలు.. గుట్టలు.. లోతట్టు ప్రాంతం.. నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలోని రెండు గుట్టల మధ్యలో రెండు వాగుల నుంచి ఎప్పుడూ కడెం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ రెండు గుట్టలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే సుమారు 6. 22 టీఎంసీల నీటిని ఉపయోగంలోకి తీసుకురావచ్చనే ఉద్ధేశంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది. బోథ్ నియోజకవర్గంలో జలవనరులకు కొదువ లేదని, ఈ ప్రాజెక్ట్కు మోక్షం లభిస్తే బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల చెందిన రైతులకు వరప్రదాయిగా మారుతుందని అప్పటి ప్రభుత్వం భావించింది.

స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత..

నియోజకవర్గంలోని నల్ల రేగడి భూముల్లో తెల్ల బంగారాన్ని పండించే రైతులు వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణంపై మూడు మండలాల రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి కడెం వాగు వద్ద ప్రతి ఏటా కురుస్తున్న వర్షాలకు 18 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో సర్వే చేశారు. 394 మీటర్ల స్థాయిలో రూ. 744 కోట్ల వ్యయంతో 5.32 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజ్వరాయర్, 3 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే జలాశయంను నిర్మించాలని ప్రతిపాదించారు. సమగ్ర ప్రాజెక్ట్ సర్వే (డీపీఆర్) ను రూపొం దించి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

ఈ రిజర్వాయర్ను కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ గా వాడుకోవచ్చు. కుప్టి వద్ద నుంచి 18 టీఎంసీల నీరు వృథాగా పోతున్నందున, కడెం జలాశయానికి 13.42 టీఎంసీల కేటాయింపులు ఉన్నా ప్రాజెక్టులో నిల్వ 7.2 టీఎంలు మాత్రమే కావడంతో మిగిలిన 6.22 టీఎంసీల నీరును వాడుకోలేకపోతున్న దృష్ట్యా కుప్టి ప్రాజెక్టుతో ఆ కొరత తీర్చవచ్చని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే భవిష్యత్ లో కడెం ప్రాజెక్ట్ కూ ఎలాంటి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండదని ఈ ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కడెం ప్రాజెక్ట్కూ ప్రమాదం పొంచి ఉంది. నీటి ప్రభావం వల్ల కడెం గేట్లపై నుంచి వర్షం నీరు పొంగి ప్రవహిస్తుండటంతో ఎప్పుడు కట్ట తెగిపోతుందోనని ఆయకట్టు కింది రైతులు, గ్రామాల ప్రజలు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.

గతంలో జరిగిన అసెంబ్లీ, పార్ల మెంట్ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ కుప్టి ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి త్వరలోనే కుప్టి ప్రాజె క్ట్ కు టెండర్లను పిలిచి పనులను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించి రైతుల్లో ఆశలు రేకెత్తించారు.

అసెంబ్లీ సాక్షిగా సీఎం హామీ..

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లు దాటిపోతున్నా నేటి వరకు టెండర్ల ఊసేలేదు. రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం చెన్నూర్ ఎస్సీ నియోజక వర్గంలో ఎత్తి పోతల పథకానికి ఏకంగా రూ.16 వందల కోట్లు సీఎం మంజారు చేశారు. ఎస్టీ నియోజక వర్గమైన బోథ్ లోని కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కు ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం నిధులు కూడా వెచ్చించలేకపోవడంతో కుప్టి పై నీలి నీడలు అలుముకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం హామీ నీటి మూటలుగానే మిగిలిపోయిందని, బోథ్ ప్రాంతం పట్ల సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మాటకరి అని, చేతల కారి కాడని రైతులు మండిపడుతున్నారు. కుప్టి ప్రాజెక్టు పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు లేరని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోసమే కుప్టి ని ప్రచారంగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు నిర్వాసిత గ్రామాలు..

కుప్టి ప్రాజెక్టు నిర్మాణంలో కుమారి, గాజిలి, గాంధారి, కుప్టి గ్రామాల పరిధిలో సుమారు 1037 కుటుంబాలు నిర్వాసితులు కానున్నారు. నిర్వాసితుల సంఖ్య 3024 మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. నాలుగు గ్రామాలకు చెందిన 2,500 ఎకరాల భూమి ముంపు పరిధి లోకి రానున్నదని సర్వేలో పేర్కొన్నారు.

బహుముఖ ప్రయోజనాలు

గడిచిన ముప్పై ఏళ్లలో కడెం ప్రాజెక్టు నుంచి 1400 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తే నీరు భారీగా నిల్వ ఉంటుంది. వర్షాధారం పై ఆధారపడుతున్న మూడు మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా బీడుగా ఉన్న భూములు సస్యశ్యాలం కానున్నాయి. దాదాపు 30 వేల ఎకరాల భూములకు సాగు నీరు అందనుంది. భవిష్యత్తులో ఎత్తి పోతల (లిఫ్ట్ ఇరిగేషన్) ద్వారా చివరి భూములకు సాగు నీరు అందించ వచ్చు. రైతన్నలు రెండు పంటలను సాగు చేసు కునే అవకాశం ఉంది. పచ్చని పంటలతో కుప్టి కళకళ లాడుతుంది. భూగర్భ జలాలు సమృ ద్ధిగా పెరుగుతాయి. తాగు నీటికి కట కట ఉండదు. చేపల వృత్తికి, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. కుంటల జలపాతం కు నిరంతరం నీటితో ఏడాది పొడవునా పర్యాటకులను కను విందు చేయనుంది. కుప్టి మినీ శ్రీశైలంగా విరా జిల్లే వీలుంది. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లను వేసి, అన్నదాతల ఆశలను తీరుస్తుందా.. లేక ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల హామీ ఇచ్చి చేతులు దులుపుకుంటుందో వేచి చూడాలి.

స్పష్టమైన హామీ ఇవ్వాలి

నరేశ్ రెడ్డి ఉప సర్పంచ్, గ్రామం కుమారి

కుప్టి ప్రాజెక్టు నిర్మాణం పై అనుమానాలున్నాయి. ప్రాజెక్టు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్ట మైన హామీ ఇస్తేనే ఈ ప్రాంత ప్రజలు, రైతులు నమ్ముతారు. పేపర్లో, న్యూస్ ఛానల్లో చెప్పడం కాదు. చేతల్లో చూపించాలి. ఎనిమిదేళ్ల క్రితం ప్రాజెక్టు వ్యయంకు రూ. 744 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అంచనా వ్యయం పెరిగి రూ 1100 కోట్లకు చేరింది. నిర్వాసితులకు పరిహారం ప్రకటించి, టెండర్లు వేస్తేనే నమ్మకం కలుగుతుంది.

ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వాలి

గజ్జెల గంగయ్య, రైతు, కుమారి గ్రామం

నాకు రెండెకరాల చేను తప్ప ఏమీ లేదు. ప్రాజెక్టు కింద ఉన్న భూమి మొత్తం పోతుంది. ప్రాజెక్టు కట్టుడేమే కానీ, ఊళ్ళో భూములు అమ్ముదామంటే కొనడానికి ముందుకెవరు రావట్లే. గిప్పుడు సర్కార్ ఎకరాకు రూ. 25 లక్షలు ఇచ్చి కొనాలి. ప్రభుత్వ జాగలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలే.

Advertisement

Next Story

Most Viewed