- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక ఇబ్బందుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: పేద విద్యార్థులు చదువును మధ్యలోనే మానేయడాన్ని నిలుపుదల చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఆర్థిక ఇబ్బందులతో అపసోపాలు పడుతోంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో భోజన బిల్లులు చెల్లించకపోవడంతో ఏజెన్సీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి నెలా అందాల్సిన భోజన బిల్లులు నెలల తరబడి బకాయిలుగా ఉండిపోతున్నాయి. దీంతో ఏజెన్సీలు విధి లేక బయట అప్పులు చేసి పిల్లల కడుపు నింపుతున్నాయి. జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి.
జిల్లాలో 1,164 ఏజెన్సీలు..
జిల్లా వ్యాప్తంగా 1164 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. 2304 మంది వంట మనుషులు, హెల్పర్లు పనిచేస్తున్నారు. ఆయా భోజన ఏజెన్సీల పరిధిలోని పాఠశాలలో నమోదైన విద్యార్థినీ, విద్యార్థులు 99,952 మంది ఉన్నారు.
ఏయే క్లాసుకు ఎంత చెల్లిస్తున్నారు?
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే ప్రైమరీ సెక్షన్ విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి భోజన ఖర్చుల కింద రూ. 5.45 లు ప్రభుత్వం చెల్లిస్తుంది. 6 నుంచి 8 వ తరగతి విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ. 8.17 లు, 9, 10 తరగతులు చదివే ఒక్కో విద్యార్థికి రూ. 10.67 లు ప్రభుత్వం ఒక పూట భోజనం ఖర్చులకు చెల్లిస్తోంది.
మార్కెట్ ధరలకు..
భోజన ఏజెన్సీ లకు ప్రభుత్వం చెల్లిస్తున్న భోజన ఖర్చులకు మార్కెట్ ధరలకు అసలు పొంతన ఉండటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. విద్యార్థులకు వారంలో మూడు రోజులు భోజనంతో పాటు కోడిగుడ్లు కూడా పెడుతున్నారు. ప్రభుత్వం ఒక్కో కోడి గుడ్డుకు రూ. 5 లు మాత్రమే చెల్లిస్తోంది. కానీ, మార్కెట్లో కోడి గుడ్డు ధర రూ. 6 లకు లభిస్తుంది. మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే ఖర్చులు కూడా పెంచకపోవడంతో ఏజెన్సీలు నష్టపోతున్నాయి.
ఒక కోడిగుడ్డు పైనే భోజన ఏజెన్సీలు ఒక్కో రూపాయి నష్టపోతున్నాయి. కూరగాయలు, పప్పులు, నూనెలతో పాటు పోపు సామాన్ల ధరలు కూడా బాగా పెరిగాయని, ప్రభుత్వం చెల్లించే భోజన ఖర్చులు తమకు ఏ మూలకు సరిపోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెలా బిల్లులైనా సరిగా చెల్లిస్తే..
ప్రతినెలా భోజన ఖర్చులు ప్రభుత్వం నుంచి రెగ్యులర్ గా రాకపోవడంతో బయటి నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చి పిల్లల కడుపు నింపుతున్నట్లు కొందరు వాపోయారు. కనీసం ప్రభుత్వం చెల్లించే భోజన బిల్లులైనా ప్రతినెలా చెల్లిస్తే తమకు అప్పుల బాధ నైనా తీరుతుందని వారు అంటున్నారు. కొన్నిచోట్ల భోజనం ఏజెన్సీల పరిస్థితిని అర్థం చేసుకొని స్కూల్ హెడ్మాస్టర్లు ఆర్థికంగా ఆదుకుంటున్నారు. మరికొందరు తమకు తెలిసిన వ్యాపారుల వద్ద పప్పులు, ఉప్పులు, కోడిగుడ్లు, ఇతర వంట సామాగ్రి అరువుకు ఇప్పించి సహకరిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.
కారం నూనెతో అన్నం మెతుకులు..
కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు స్థానిక మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు పొడికారం, నూనె కలిపిన భోజనం పెట్టారని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏజెన్సీని రద్దు చేస్తానని హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు నివేదిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం ఎలాగో ఏజెన్సీల బాధలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా పరిస్థితిని అర్థం చేసుకుని భోజనం ఏజెన్సీలకు ఇచ్చే ఖర్చుల నిధులను పెంచితే ఇలాంటి సమస్యలు పునరావృతం కావని ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. ప్రతి నెల భోజన ఖర్చులు క్రమం తప్పకుండా చెల్లిస్తే మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు.
మా సమస్యలు పట్టించుకోవాలి
మా సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఎన్నోమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా, రాజధాని హైదరాబాద్ లో ధర్నాలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించి ప్రతినెలా బిల్లులు మంజూరు చేయాలి.:- జంగాల చిన్నుబాయి మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం అధ్యక్షురాలు