సహకార బ్యాంక్ అధికారులా..? రికవరీ ఏజెంట్ల..?

by Sumithra |   ( Updated:2023-03-20 04:38:04.0  )
సహకార బ్యాంక్ అధికారులా..? రికవరీ ఏజెంట్ల..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నసురుల్లాబాద్ మండలం దూరికి గ్రామంలో ఈనెల 18న ఒక రైతు తీసుకున్న రెండు లక్షల రుణబకాయిల వసూళ్ల కొరకు అతని ఇంటి తలుపులను బ్యాంకు సిబ్బంది పెకిలించడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సహకార బ్యాంక్ సిబ్బంది ఓ వ్యక్తి తీసుకున్న రుణం వసూళ్లు కాకపోవడంతో అతని బైక్ లాక్కుని వచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోని డీసీసీబీ బ్యాంక్ సిబ్బంది రుణాల వసూళ్ల కోసం వెళితే మేనేజర్ కు రైతుకు గొడవ జరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది. బ్యాంక్ ఉపాధ్యక్షుడు జోక్యం చేసుకుంటేగాని కేసుకాంప్రమైజ్ కాలేదు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలోని కామారెడ్డి, గాంధారి, జక్రాన్ పల్లి, నందిపేట్, ఎడపల్లి ప్రాంతాలలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనుబంధ శాఖల అధికారులు సిబ్బంది పాత బకాయిల వసూళ్ల కోసం వ్యవహరిస్తున్న తీరు అధికారులకు తక్కువగా, ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లకు ఎక్కువగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ లో గల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖ నుంచి రూ.15 లక్షల రుణం ఒకరు, అదే శాఖలో 14 లక్షల 93 వేల రుణాలు మరొకరు, 14 లక్షల 92,000 మరొకరు తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ బ్యాంకు బ్రాంచ్ నుంచి 28 లక్షలు ఒక మహిళ, మద్నూర్ బ్రాంచ్ నుంచి ఒకరు ఇరవై ఒక్క లక్షలు, నందిపేట బ్రాంచ్ నుంచి మహిళ పేరిట 11 లక్షలు, లింగంపేట్ బ్రాంచ్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి పై ఐదు లక్షల చొప్పున రుణాలు తీసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. కానీ వారెవరికి నోటీసులు ఇవ్వలేదు. పత్రికలలో బహిరంగ ప్రకటన చేయలేదు. వారి వద్ద నుంచి ఒక రూపాయి రుణం గాని, వడ్డీ కానీ వసూలు చేయలేదు. వారి ఇండ్ల వద్దకు వెళ్లి గాని వారు చేసే వ్యాపార సముదాయాల వద్ద బ్యాంకు సిబ్బంది రికవరికి ప్రయత్నించినట్టుగానే కనిపించదు.

ఎందుకంటే నిజామాబాద్ డీసీసీబీ బ్యాంక్ పరిధిలోని 50 పై చిలుకు శాఖల్లో రుణాలు తీసుకుంది పెద్ద తలకాయలే. దాదాపు 130 కోట్ల రుణాలు పెద్దలు తీసుకున్నవి. కానీ బ్యాంకు సిబ్బంది అధికారులు పైపులైన్లు, సబ్మెర్సిబుల్ పంపు ఏర్పాటు, ట్రాక్టర్ కొనుగోలు ఇలాంటి రుణాలు తీసుకున్న వారిని వేదించడం పెరిగిపోయింది. ముఖ్యంగా పాలకమండలి సమావేశాల్లో రుణాల వసూళ్ల వ్యవహారం ఎక్కడికి వచ్చిందని బ్యాంక్ అధికారులను నిలదీసిన డైరెక్టర్లుగా ఉన్న ప్రాంతంలోని బ్రాంచ్ పరిధిలో వేధింపులు ఎక్కువయ్యాయి. బ్యాంకు పాలకవర్గ సమావేశాల్లో సైలెంట్ గా ఉండే అధికారులు సిబ్బంది చిన్న సన్నకారు రైతులు చిరు వ్యాపారుల కోసం రుణాలు తీసుకున్న వారిని టార్గెట్ చేయడం పై విమర్శలు వస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ ఆర్జనలో ఖమ్మం జిల్లా తర్వాత రెండో స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రైతులకు, ఇతరులకు వ్యాపారం కోసం ఇచ్చిన రుణాలు 200 కోట్ల వరకు ఉండడంతో బకాయిల వసూళ్లకు ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్యాంకు అప్పులు 220 కోట్ల వరకు ఉన్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో దాదాపు ఆరు నెలల సమయంలోని 30 శాతం వడ్డీ తగ్గింపు ప్రకటనతో సుమారు 40 కోట్ల వరకు వసూలు అయ్యాయి కానీ మరో 180 కోట్లు మొండి బకాయిల వసూలు బ్యాంక్ అధికారులకు పాలకవర్గానికి పట్టపగలు చుక్కలు చూపుతున్నాయి.

ప్రస్తుత పాలక మండలికి ముందున్న రెండు పాలకవర్గాల హాయంలో లాంగ్ టర్మ్(బిజినెస్) రుణాలు, క్రాఫ్ లోన్ లు ఇచ్చారు. అందరి వద్ద భూములను, ఇళ్లను, ఓపెన్ ప్లాట్లను తనకా (మార్టి గేజ్) పెట్టుకుని రుణాలు ఇచ్చారు. అందులో పలుకుబడి పాలకవర్గం ఆనాటి అధికార పార్టీ నేతల మెప్పుతో కొందరు పది లక్షల నుంచి 30 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం బ్యాంకుకు 150 కోట్ల రుణాల బకాయిలు ఉండగా అందులో దాదాపు పెద్దలు తీసుకున్న రుణాలు 130 కోట్ల వరకు ఉంటాయని అంచనా.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రైతులు తీసుకునే రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి ఇవ్వాల్సిన రిబేటు ఆరు శాతానికి తోడు మరోఆరు శాతం కలిపి 12 శాతం ఇవ్వాల్సింది. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. దాని నమ్ముకొని కిస్తులు చెల్లించని వారికి వడ్డీ అమాంతం పెరిగిపోయింది. డిసిసిబి బ్యాంక్ పరిధిలోని ఓవర్ డ్యూ ఎక్కువగా కామారెడ్డి, తాడువాయి, లింగంపేట్, బిచ్కుంద, నసురుల్లాబాద్, వేల్పూర్, నందిపేట్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. వారి వద్ద నుంచి మొండి బకాయిలు వసూలు చేయని బ్యాంక్ అధికారులు సిబ్బంది చిన్న సన్న కారు గా రుణాలు తీసుకున్న వారిని మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో రుణాల వసూళ్ల కోసం 30% మాఫీ చేసిన చెల్లింపులకు పెద్ద తలకాయలు ఇవ్వరు ముందుకు రాలేదు ఇప్పటివరకు చెల్లించిందంతా చిన్న సన్నకారు రైతులు మాత్రమే. ఇప్పుడు కూడా బ్యాంక్ అధికారులు వారిని టార్గెట్ చేయడం విమర్శలు వస్తున్నాయి. బ్యాంక్ అధికారులు రుణాల రికవరీ తక్కువ టీఏలు డిఏలు ఎక్కువ రాసుకుంటున్నారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని వస్తువుల కొరకు ఇప్పుడే కావాలంటే ఎక్కడికి వెళ్లి తెస్తారని రుణాలు తీసుకున్న వారిని టార్గెట్ చేయడం పై విమర్శలు వస్తున్నాయి. ధాన్యం పసుపు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల సీజన్ కానప్పుడు రుణాలు తీసుకున్న వారిని వేధించడం మరీ చిన్న కారు సన్న కారు రుణాలు తీసుకున్న వారిని టార్గెట్ చేయడంపై ఆరోపణలు ఉన్నాయి.

పాలకవర్గం సమావేశాల్లో రుణాల రికవరీ గురించి పట్టించుకోని అధికారులు ఏకంగా పాలకవర్గం డైరెక్టర్లు ఉన్న ప్రాంతాల్లోని చిన్నవారినివేదించి పెద్దవారిని వదిలేయడం పై ఆరోపణలు వస్తున్నాయి. డిసిసిబికి గుది పండగ మారిన పెద్దల రుణబకాయిలను ముందు వసూలు చేయాలని అప్పుడే డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవచ్చు అని పాలకవర్గ సభ్యులే చెబుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా మొద్దు నిద్రలో ఉన్న బ్యాంక్ అధికారులు ఎన్నికల కోలాహలం ప్రారంభం సమయంలో చిన్న సన్నకారు రుణాలు తీసుకున్న వారిని వేధించడం అధికార పార్టీకి ఎదురు దెబ్బెనని చెప్పాలి. అసలే పాలకవర్గానికి, చైర్మన్ మధ్య విభేదాలు ఉండగానే రుణాల వసూళ్ల వ్యవహారం పాలకవర్గానికి కొత్త తలవంపులు తెచ్చిపెడుతుంది.

Advertisement

Next Story