డిప్యూటీ సీఎం జైలులో.. కవిత బయట.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ

by Sumithra |
డిప్యూటీ సీఎం జైలులో.. కవిత బయట.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ
X

దిశ, కామారెడ్డి : ఢిల్లీ పర్యటన రహస్య ఎజెండా ఏంటో కేటీఆర్ బయట పెట్టాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. తన సోదరి కవిత అరెస్ట్ కాకుండా, వారి అవినీతి పై విచారణ జరగకుండా ఉండేందుకే కేంద్రమంత్రులను కేటీఆర్ కలుస్తున్నారని ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో తన నివాసంలో విలేకరులతో షబ్బీర్ అలీ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ రెండేళ్లుగా చెప్తుందని, నేడు కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో తాము చెప్పిందే నిజమని నిరూపణ అయిందన్నారు. మంత్రి కేటీఆర్ డిఫెన్స్ మంత్రిని కలవడం, హోం మంత్రి అమిత్ షాను కలవబోతుండటం వెనక రహస్యమేంటని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఏరోజైనా కలిశారా అని ప్రశ్నించారు. ఒక్కరోజైనా ప్రధానికి, కేంద్ర మంత్రులకు అభివృద్ధి నిధుల కోసం మెమొరాండం సమర్పించారా అని నిలదీశారు. ఎన్నికలు మూడు నెలలు ఉండగా ఢిల్లీ పర్యటన రహస్య ఎజెండా ఏంటో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా, తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకే రహస్య భేటీ అని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలులో ఉంటే ఎమ్మెల్సీ కవిత బయట ఉంటారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవడం పై రాజకీయ కోణంలో చూడొద్దన్న బండి వ్యాఖ్యల పై షబ్బీర్ అలీ స్పందించారు. బీజేపీ సిద్దాంతాలు, విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు నాయకులు పారిపోతున్నారని చెప్పారు. బీజేపీ నుంచి తమ పార్టీలో చేరే వారి లిస్ట్ చాలా ఉందని హాట్ కామెంట్స్ చేసారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ నాయకులకు, ప్రజలకు అర్థం అయిందన్నారు.

"గంప" సవాలుకు సిద్ధమే..

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నాణ్యత పరిశీలించేందుకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన సవాలుకు తాను సిద్ధంగా ఉన్నానని షబ్బీర్ అలీ మరోసారి గంప ఛాలెంజ్ ను స్వీకరించారు. మొన్న తాను డబుల్ ఇళ్ల వద్దకు వెళ్తే దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని, 22 వ తేదీ తర్వాత ఇంజనీర్లను తీసుకుని వెళ్దామని, తేదీ చెప్పాలనీ గంప గోవర్ధన్ సవాల్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. డబుల్ ఇళ్ల నాణ్యత పరిశీలనకు వచ్చిన మెస్త్రిలను చిన్నచూపు చూసిన గోవర్ధన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా కట్టిన ఇళ్లలోకి ప్రజలు వెళ్ళడానికి భయపడుతున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.

డబుల్ ఇల్లు కూలిపోయి ఎవరికైనా ప్రమాదం జరిగితే గంప గోవర్దన్, కేసీఆర్ లపై కేసులు పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ సంపాదించడం కోసమే షబ్బీర్ అలీ షో చేస్తున్నారని గంప చేసిన ఆరోపణల పై స్పందిస్తూ.. తాను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడినని, తాను ఒకరికి టికెట్ ఇప్పించే స్థాయిలో ఉన్నానని, టికెట్ కోసం రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, పట్టణ, మండల అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story