మరోసారి అవకాశం ఇస్తే నిజామాబాద్ ను రోల్ మోడల్ చేస్తా

by Sridhar Babu |
మరోసారి అవకాశం ఇస్తే నిజామాబాద్ ను రోల్ మోడల్ చేస్తా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ లో ప్రజలు 2014, 2018లో ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించడంతో 9 సంవత్సరాల కాలంలో 1200 కోట్లకు పైగా నిధులతో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే నిజామాబాద్ రోల్ మోడల్ అభివృద్ధి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్​ ది ప్రెస్ లో అర్బన్ బీఆర్ ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా మాట్లాడుతూ తనకు రాజకీయం కొత్త కాదని, తన తాత 20 సంవత్సరాలు మాక్లూర్ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచిగా పనిచేశారని, తన మామ 20 సంవత్సరాలు సర్పంచ్​గా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారని తెలిపారు. వారి కారణంగానే తాను వివిధ వ్యాపారాలు చేస్తున్న సమయంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా హైదరాబాదులో దేశ రాజధానిలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నానని అన్నారు.

2009లో బీఆర్ఎస్ అవకాశం ఇవ్వడంతో ఎంపీగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచానని అన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచి నగర రూపురేఖలు మార్చానని అన్నారు. నగరం మొత్తం సుందర రోడ్లతో పాటు డ్రైనేజీ నిర్మాణాలు చేశానని, డివైడర్లు, జంక్షన్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మెరీడియన్ పనులు కూడా పూర్తి చేశానని అన్నారు. నిజామాబాద్ నగరంలో మినీ ట్యాంక్ బండ్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, పార్కుల నిర్మాణం పూర్తి చేశానని అన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, ఇంటర్నల్ కనెక్షన్​ పనులు మాత్రమే మిగిలాయని అన్నారు. వాటికి ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, ఎలక్షన్ కోడ్ కారణంగా అవి ఆగిపోయాయని అన్నారు. నగరంలో కబ్జాలు, కమీషన్లపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు తాను జవాబు ఇవ్వ దలుచుకోలేదని అన్నారు. తాను ఏంటో ప్రజలకు తెలుసని, వచ్చే ఎన్నికల్లో వారే నా అభివృద్ధి నా తీరును చూసి ఓట్లు వేసి గెలిపిస్తారని అన్నారు.

Next Story

Most Viewed