మహిళలకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు..

by Sumithra |
మహిళలకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో గల ఎంజే ఆసుపత్రిలో ఈనెల 12వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో పేదమహిళలకు ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మధు శేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో గల ఎంజే ఆసుపత్రిలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి డాక్టర్ మధుశేఖర్ మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేయూత స్వచ్ఛంద సంస్థలోని 38 మంది వైద్యులతో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని ఆర్మూర్ డివిజన్ లోని మహిళలు సద్వినియోగం చేసుకొని పేర్లునమోదు చేసుకోవాలన్నారు. వైద్యురాలు శిరీష మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మహిళలకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తామన్నారు. క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలను దూరం చేసి తొందరగా ఏ విధంగా గుర్తించాలనేది సూచిస్తామన్నారు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం100కు పైగా మహిళల పేర్లను నమోదు చేసుకున్నారని వివరించారు. ఇన్ని ఆపరేషన్లు ఒకే ఆస్పత్రిలో చేయడంలో కొంత ఇబ్బంది అవుతుంది.

కాబట్టి ఏ విధంగా ఈ ఆపరేషన్లు చేయాలో వివరిస్తామన్నారు. క్యాన్సర్ వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తాం కాబట్టి ఈ అవగాహన సదస్సు ద్వారా క్యాన్సర్ కారకాలు గుర్తించే విధానం తెలియజేస్తామన్నారు. వైద్యురాలు శృతి మాట్లాడుతూ పేద మహిళలు ఆపరేషన్లు చేసుకునే అవకాశం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వీరికి సహాయం చేయడం కోసం ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ ను ముందుగా రెండు దశలలో గుర్తించాల్సి ఉందన్నారు. మహిళల్లో అవగాహన లేకపోవడంతో గుర్తించక అనేకమంది ఇబ్బందులకు గురై మృతి చెందడం బాధగా ఉందన్నారు. ఈ సమావేశంలో వైద్యులు వసంత, శ్రీలత, లింగారెడ్డి, ఏలేటి అమృత్ రాంరెడ్డి, రవీందర్, వంశీకృష్ణ, రాజేష్, సాగర్, పాల్గొన్నారు.

Advertisement

Next Story