- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మరో నెల రోజుల్లోపు పంట దిగుబడులు చేతికి అందనున్న ప్రస్తుత తరుణంలో చీడపీడల బెడదతో రైతులు నష్టపోకుండా సస్యరక్షణ చర్యలపై వారికి అవగాహన కల్పించాలని శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవసాయ అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణ పరిస్థితులలో చోటుచేసుకున్న మార్పుల వల్ల పంటలకు దోమపోటు, ఆకుముడత వంటి తెగుళ్లు, చీడపీడలు సోకే ప్రమాదం ఉండడడంతో వాటి నివారణ కోసం ముందస్తుగానే చర్యలు చేపట్టేందుకు వీలుగా గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను ఈ సమావేశానికి ఆహ్వానించగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఆయా పంటలకు ఎలాంటి చీడపీడలు సోకే అవకాశం ఉంది, వాటి బారి నుండి పంట దిగుబడిని కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు కీలకమైన సూచనలు చేశారు. రానున్న మూడు రోజులలో మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దరిమిలా పంటలకు నష్టం వాటిల్లకుండా చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో ఈసారి ఖరీఫ్ లో 4.29 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని, అందులో 85 శాతానికి పైగా సన్నరకం ధాన్యం సాగు చేస్తున్నారని అన్నారు.
భారీ వర్షాల వల్ల వరి పంటకు చీడపీడలు సోకే ప్రమాదం ఉన్నందున ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, ఇతర వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులను కలిసి వారికి సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని హితవు పలికారు. జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా చీడపీడల వల్ల దిగుబడులు కోల్పోయి నష్టపోకుండా అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా చీడపీడల కారణంగా రైతులు నష్టపోతే, సంబంధిత వ్యవసాయ అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని అన్నారు. అదే సమయంలో రైతుల ప్రయోజనాలు కాపాడడమే ధ్యేయంగా పని చేసే వ్యవసాయ అధికారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. రైతులకు నష్టం చేకూరేలా వ్యవహరించే ఎరువులు, విత్తన దుకాణాల డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలతో పాటు, అవసరం లేకపోయినప్పటికీ అధిక లాభార్జన కోసం ఎక్కువ పరిమాణంలో ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు అంటగట్టే డీలర్లపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్రమం తప్పకుండా ఎరువులు, క్రిమిసంహారక దుకాణాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు సైతం దుకాణ డీలర్లను సంప్రదించకుండా, పంటలకు ఏవైనా చీడపీడలు సోకితే వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను సంప్రదించాలని హితవు పలికారు. వారి సలహాలు, సూచనలను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆర్థిక పురోగతిలో పయనించాలని అన్నారు. మోతాదుకు మించి ఎరువులు, పిచికారీ మందులు వాడి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, భూసారాన్ని కోల్పోకూడదని జాగ్రత్తలు సూచించారు. ఈ దిశగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ, అన్నదాతలు పూర్తి స్థాయిలో దిగుబడులు పొందేలా వారికి సలహాలు, సూచనలు అందించాలన్నారు. చీడపీడలు, తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. పంటల మార్పిడి, స్వల్పకాలిక దిగుబడిని అందించే పంటలతో సమకూరే లాభాల గురించి అన్నదాతలకు అవగాహన కల్పించాలన్నారు. శాస్త్రవేత్తలు తెలియజేసిన సస్యరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, శాస్త్రవేత్తలు డాక్టర్ బాలాజీ నాయక్, రాజ్ కుమార్, దివ్య, ఏడీఏ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- crop protection