మున్సిపాలిటీగా మారనున్న దోమకొండ...?

by Sumithra |
మున్సిపాలిటీగా మారనున్న దోమకొండ...?
X

దిశ, భిక్కనూరు : జిల్లాలో ఎక్కడా లేని విధంగా భిక్కనూరు మండలకేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను అధికారులు చేపడుతున్నారు. భావితరాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేయడం ఒక కారణమైతే, అతి త్వరలో మండలం మున్సిపాలిటీగా మారుతుందన్న ఆలోచన మరోవైపు. అందుకేనేమో ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా... దాన్ని లెక్కచేయకుండా అదికారులు 55 ఫీట్లకు మురికి కాలువలు చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం భిక్కనూరు మండల కేంద్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న ఒక్క అంచనూర్ గ్రామాన్ని మాత్రమే దోమకొండలో విలీనం చేస్తూ ప్రతిపాదనలు తయారు చేసి పంపినట్లు తెలుస్తోంది. తొందర్లోనే దోమకొండ మండల కేంద్రం మున్సిపాలిటీగా రూపుదిద్దుకోనుంది. కాగా నెక్స్ట్ లిస్టులో భిక్కనూరు మండల కేంద్రం మున్సిపాలిటీగా మారుతుందన్న ఉద్దేశంతోనే మెయిన్ రోడ్డును రెండు వరుసల రహదారిగా మార్చి సెంటర్ లో డివైడర్ నిర్మించి దాంట్లో పూలమొక్కలను పెంచుతున్నారు. రోడ్లు విశాలంగా ఉండడం వలన పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

దీంతో పక్కనే ఉన్న మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ అయినప్పటికీ, అక్కడ డివైడర్ తో కూడిన రెండు లైన్ల రహదారి ఇంత వరకు కాలేదని, భిక్కనూరు పట్టణం మాత్రం అభివృద్ధిలో ఎంతో ముందుందని రామయంపేటకు చెందిన పట్టణ ప్రజలు ఇక్కడ చేపట్టిన విస్తరణ పనులను, జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార పరంగా రామాయంపేట అభివృద్ధి చెందినప్పటికీ, పట్టణాభివృద్ధి పరంగా చూస్తే ఎంతో వెనుకబడి పోయిందన్న నైరాశ్యం అక్కడి ప్రజల్లో వ్యక్త మవుతోంది. ఈ విధంగా విశాలమైన రోడ్లు నిర్మించడం వలన అభివృద్ధితోపాటు, వ్యాపార పరంగా భిక్కనూరు ఎంతో డెవలప్ అవుతుందన్న వాదన కూడా స్థానిక నేతల్లో వినిపిస్తోంది. మురికి కాలువల నిర్మాణ పనులను బాధిత ఇండ్ల యజమానులు కొందరు వ్యతిరేకించినా...? వారి మాటలను, అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా సర్పంచ్ తునికి వేణు, పాలకవర్గ సభ్యులు దగ్గరుండి కూల్చివేత పనులు చేపట్టడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed