వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు.. హోటళ్లు, రెస్టారెంట్ల ఇష్టారాజ్యం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-18 03:07:16.0  )
వెజ్ బిర్యానీలో  చికెన్ ముక్కలు.. హోటళ్లు, రెస్టారెంట్ల ఇష్టారాజ్యం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్భాటంగా తళుకు బెళుకుల ఇంటీరియర్‌తో ఆకట్టుకునే ఫర్నిచర్‌తో జిల్లాలో ఏర్పాటు చేసిన హోటళ్లలో నాణ్యతా లోపాలు, అపరిశుభ్రత వెలుగుచూస్తుండటంతో ఆహార ప్రియులు షాక్ అవుతున్నారు. ఇందూరులోని హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే, ఇంకా తినాలంటే కొంచెం ఆలోచించాల్సిందే అంటున్నారు ఆహార ప్రియులు. ఆకలిగా ఉందని ముందుకు వచ్చింది కదా అని గబగబా తిన్నావో, నువ్వేం తిన్నావో అర్థమయ్యే లోపు అనారోగ్యం బారిన పడతావ్ జాగ్రత్త అంటున్నారు అనుభవజ్ఞులు.

ఈ మధ్య కాలంలో నిజామాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్ లకు సిబ్బంది సర్వ్ చేసే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలలో బొద్దింకలు. జెర్రీలు కనిపించడం కామన్ గా మారిపోయింది. అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు ఆశించిన రీతిలో హోటల్స్, రెస్టారెంట్లపైన కఠినమైన చర్య లు తీసుకోకపోవడంతో ఇలాంటి అనుభవాలు కస్టమర్లకు తరచూ ఎదురవుతున్నాయి. నగరంలోని వినాయక్ నగర్ లోని ఓ హోటల్ లో పన్నీర్ బిర్యానీ పార్శిల్ ఆర్డర్ ఇస్తే ఆ బిర్యానీలో పన్నీర్ తో పాటు చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. దీంతో సదరు కస్టమర్ ఖంగుతిన్నాడు. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడమేంటని మొదట ఆశ్చర్యానికి గురై శ్రద్దగా గమనిస్తే అవి చికెన్‌ ముక్కలే అని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు. గతంలో చికెన్ బిర్యానీలో బొద్దింక, జెర్రిలు కూడా దర్శనమిచ్చాయి.

హోటల్స్, రెస్టారెంట్లలో కస్టమర్లకు కలిగిన ఇలాంటి అనారోగ్యకర అనుభవాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే సింపుల్‌గా ఫైన్ రాసేసి ఇక తమ పనైపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలోని వంటశాలలో గోడలపైన బల్లులు పాకుతూ కనిపిస్తుంటాయి. బొద్దింకలు కనిపించడం షరా మామూలేనని కిచెన్ లో పనిచేసే వారు చెబుతారు. ఇతర కిచెన్ షెడ్‌లో క్లీనింగ్ పై అంతగా శ్రద్ధ పెట్టకపోవడం. కుక్ చేయడమే తప్ప క్లీన్ గా ఉంచుకోవడం తమ పని కాదన్నట్లుగా వ్యవహరించడం కారణంగా వంటల్లో ఏవేవో కలుస్తున్నాయి. కస్టమర్లు తినే ఆహారంలో అవి కలిసిపోతున్నాయి. ఎప్పుడో ఒకసారి దృష్టికి వచ్చే సరికి విషయం బయటపడి ఆందోళన కలిగిస్తోంది.

ఫుడ్ సర్వీస్ యాప్‌లలో కూడా..

ఫుడ్ సర్వీస్ యాప్‍‌లలో ఆర్డర్ పెట్టిన ఫుడ్‌లలో కూడా నాణ్యత లోపంతో ఉన్న ఫుడ్ కూడా సప్లై అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి ఓ పాపులర్ ఫుడ్ యాప్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలు బాగా పులిసి పోయినట్లుగా ఉండి వాసన పట్టి ఉన్నాయని, కొంచెం తినగానే ఏదోలా కడుపులో దేవినట్లు ఫీలింగ్ రాగానే వదిలేసానని వినాయక్ నగర్‌లో ఉండే గంగాధర్ అనే వ్యక్తి తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేద్దామని అనుకున్నప్పటికీ అప్పటికే రాత్రి 9 గంటలు దాటిపోయిందని, వదిలేసినట్లు చెబుతున్నారు.

మటన్, చికెన్‌లు ఫ్రీజ్‌లో ఉంచి వాడుతున్నారు..

మటన్, చికెన్, ఇతర నాన్ వెజ్ వెరైటీలను హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు రాత్రి మిగిలిన వాటిని ఫ్రీజ్‌లో ఉంచి కస్టమర్లకు సప్లై చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నాణ్యత లేని మాంసాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి దానికి మసాలా బాగా దట్టించి నాణ్యతా లోపం తెలియకుండా ఉండేలా చేసి కస్టమర్లకు సప్లయ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు వీటి పై దృష్టి పెడితే తప్ప ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఉండదని, హోటల్స్ , రెస్టారెంట్లలో నాసిరకం ఫుడ్ సప్లయ్‌కు అడ్డుకట్ట పడే అవకాశాలు లేవు.

Advertisement

Next Story

Most Viewed