- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్ట్ జోరు.. మత్తులో జోగుతున్న పల్లెలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో బెల్ట్ షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. అబ్కారిశాఖ అధికారు ల అండదండలతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా గల్లిగల్లికో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తోంది. మంచినీళ్లు దొరకని షాపులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు గానీ, మద్యం దొరకని చోటంటూ లేకపోవడం గమనార్హం. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది. వైన్, బార్ షాపుల్లో సమయసారిణి ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్టు షాపుల్లో మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటోంది. సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బెల్టు షాపుల ఆగడాలు ఎక్కువయ్యాయి. అనధికారిక టెండర్ ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో బహిరంగంగా మద్యం అమ్మకాలకు స్థానికంగా హక్కుల దక్కించుకుంటున్నాయి. ప్రత్యేకంగా మలిగెలు అద్దెకు తీసుకుని దర్జాగా మద్యం అమ్మకాలు బహిరంగంగా సాగిస్తున్నాయి.
బెల్టు షాపులను ఎవరైనా ప్రశ్నిస్తే మీకేం భయం లేదు.. మేమున్నాం.. మేం చూసుకుంటామనే భరోసా బెల్టు వ్యాపారులకు ఇస్తున్నాయి. బెల్టు షాపులపై అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం మాట అటుంచితే, ఫిర్యాదు చేసిన వారి పేరు వివరాలు, ఫోన్ నెంబర్ తో సహా బెల్టు షాపుల యజమానులకు అధికారులే చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎక్సైజ్ పరిధిలోని ఓ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓ బెల్టు షాపులో అక్రమ మద్యం అమ్మకాలపై ఓ మీడియా జర్నలిస్టు వార్త రాస్తే బెల్టు వ్యాపారి తన అనుచరులతో జర్నలిస్టు ఇంటి మీదికి వచ్చి దాడికి దిగిన సంఘటనలు ఉన్నాయి. అధికారుల అండతో పాటు బెల్టు షాపుల నిర్వాహకులకు గ్రామ కమిటీలు కూడా కొండంత అండగా నిలబడుతుండటంతో బెల్టు బాబులు అడ్డగోలుగా హవా చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
లైసెన్సుడ్ వైన్ షాపులు 151.. బెల్టు షాపులు దాదాపు 600 ..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పిడికెడు లైసెన్సుడ్ వైన్ షాపులుంటే గంపెడు బెల్టు షాపులన్న చందంగా బెల్టు షాపులున్నాయి. లైసెన్సుడ్ వైన్ షాపులు 151, లైసెన్సుడ్ బార్లు 26 ఉన్నాయి. వీటిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న లైసెన్సుడ్ వైన్ షాపులు 102 కాగా, లైసెన్సుడ్ బార్లు 18 ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో లైసెన్సుడ్ వైన్ షాపులు 49 కాగా, బార్లు 8 ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులు లైసెన్సుడ్ వైన్ షాపుల సంఖ్యకు మూడింతలకు పైగా దాదాపు 600 వరకుంటే అనధికారిక బార్లు పర్మిట్ రూంల మాదిరిగా విచ్చల విడిగా కొనసాగుతున్నట్లు అనధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. జాతీయ రహదారుల వెంట దాబాల్లోనే కాకుండా, గ్రామాల్లో, పట్టణాల్లోని పలు హోటల్స్ లో కూడా అనఫిషియల్ పర్మిట్ రూంలు కొనసాగుతున్నా ఇటు పోలీసులు కానీ, అటు ఎక్సైజ్అధికారులు కానీ పట్టించుకుని చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
బెల్టు షాపుల బినామీలు లైసెన్సుడ్ వ్యాపారులే..
లైసెన్సుడ్ షాపులు పొందిన వారిలోనే ఎక్కువగా బెల్టు షాపుల బినామీలుగా వ్యాపారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొందరైతే లైసెన్సు ఒక గ్రామంలో దుకాణానికి లైసెన్సు వస్తే అక్కడ వ్యాపారం సరిగా జరగడంలేదనో, మరింకేం కారణంతోనో తమకు అనుకూలమైన మండల కేంద్రాల్లో అక్కడి లైసెన్సు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా దర్జాగా నడిపిస్తున్నారు. ఇదే కాకుండా ఒక్కో లైసెన్సుడ్ షాప్ పరిధిలో కనీసం మూడు, నాలుగు బెల్టు షాపులను అనధికారికంగా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బెల్టుషాపును గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు నిర్వహించే టెండర్ ప్రక్రియలో జనాభాను బట్టి నిర్ణయించిన రేటు ప్రకారం డబ్బులు వందశాతం టెండర్ డబ్బులు ముందుగానే చెల్లించి బెల్టు షాపుల నిర్వహణకు అనుమతులు పొందుతున్నట్లు తెలుస్తోంది. లైసెన్సుడ్ షాపును పొందిన మండలంలోని గ్రామాల్లో బెల్టుషాపులు నడపాలంటే అక్కడి లైసెన్సుడ్ వ్యాపారికి తప్ప ఇతరులకు అనుమతి పొందే అవకాశం ఉండకుండా వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. కొన్ని చోట్ల లైసెన్సుడ్ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి కూడా వ్యాపారం చేస్తున్నారు.
అసలు మాటున నకిలీ మద్యం అమ్మకాలు..
లైసెన్సుడ్ వ్యాపారులు బినామీలుగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల దందాలో నకిలీ మధ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. లైసెన్సుడ్ షాపుల్లో నకిలీ మధ్యం అమ్మకాలు జరిపితే లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదంతో పాటు కేసులు కూడా అయ్యే అవకాశాలుండటంతో ఆ రిస్క్ లైసెన్సుడ్ షాపుల్లో కాకుండా బెల్టు షాపుల్లో తీసుకుని యధేచ్ఛగా నకిలీ మద్యం అమ్మకాలు, చీప్ లిక్కర్లు అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి. లైసెన్సుడ్ వైన్ షాపుల మాటుల బినామీలుగా బెల్టు షాపులు నడుపుతున్న వ్యాపారుల వ్యవహారం పూర్తిగా తెలిసినా ఎక్కైజ్ అధికారులకు అంతా తెలిసినా ఏం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా, ఎక్కడా బెల్టు షాపులు నడవడం లేదని, కంప్లయింట్స్ వస్తే కచ్చితంగా స్పందించి కేసులు కడతామని చెపుతున్నారు.
ఎవరైనా కంప్లయింట్ చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అధికారులు వ్యాపారులకు సమాచారమిచ్చి కంప్లయింట్ ఇచ్చిన వారి ప్రాణాల మీదకు తెస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బెల్టు షాపులు, కల్తీ కల్లు దుకాణాలపై ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల విషయమై ఓ ఎక్సైజ్ సీఐ అక్రమ వ్యాపారులకు ముందస్తుగానే సమాచారం లీక్ చేశాడనే విషయం ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో మా సిబ్బందికి పంపాల్సిన మెసేజ్ ను పొరపాటున మీడియా వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేయడంతో తప్పుగా అర్థం చేసుకున్నారని సీఐ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చే ఎక్సైజ్ శాఖ నుంచి అధికంగా ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖకు బెల్టుషాపులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అనధికారికంగా మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.