పెద్దసార్ల చలాన్లు కట్టించండి..వేలకు వేలు పెండింగ్ ఉంటే అడగరా..?

by Hamsa |
పెద్దసార్ల చలాన్లు కట్టించండి..వేలకు వేలు పెండింగ్ ఉంటే అడగరా..?
X

దిశ, కామారెడ్డి రూరల్: హెల్మెట్ లేని వారికి పోలీసులు వేస్తున్న చలాన్లు ఈమధ్య చాలా ఎక్కువవుతున్నాయి. దాంతో సామాన్య ప్రజలు బండి తీసుకుని బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో హెల్మెట్ నిబంధన వాహన దారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. హెల్మెట్ లేకుండా వస్తే ఎక్కడపడితే అక్కడ ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్నారు. పట్టణంలో హెల్మెట్ ధరించాలి అంటే ఇబ్బందిగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకుని వచ్చినా ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్తే బైకుపై హెల్మెట్ ఉంచి వెళ్తే సేఫ్‌గా ఉంటుందన్న గ్యారంటీ లేకుండా పోతుందని సామాన్య ప్రజలు చెప్తున్నారు. అయితే సామాన్య ప్రజలకు 500, 1000 రూపాయలు పెండింగ్ జరిమానాలు ఉంటే ముక్కు పిండి వసూలు చేస్తున్న పోలీసులు జిల్లా పెద్ద సార్ల విషయంలో ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు సంబంధించిన TS09FR8218 నంబర్ గల వాహనంపై 10,450 రూపాయల ఫైన్ పెండింగులో ఉంది.

ఇది గత 2021 సెప్టెంబర్ నుంచి పెండింగులో ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దసార్లకు ఒక నిబంధన, సామాన్యులకు ఒక నిబంధన ఉంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని అధికారులు చెప్తున్నా అడిషనల్ కలెక్టర్ వాహనానికి వేసిన ఫైన్లన్ని ఓవర్ స్పీడ్ కు చెందినవిగా ఉండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2021 నుంచి ఈ నెల 9 వరకు మొత్తం 10 ఫైన్లలో 9 ఓవర్ స్పీడ్ కు సంబంధించినవి ఉండగా ఒకటి రాంగ్ రూట్ కు సంబంధించిన ఫైన్ ఉండటం గమనార్హం.. మా వద్ద ఫైన్లు దాబాయించి వసూలు చేసే ముందు మీ అధికారుల నుంచి ముందు వసూలు చేయండి అంటూ సాధారణ ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా.. ప్రజలకు చెప్పే ముందు తాము ఆదర్శంగా ఉండాలన్న ఆలోచన అధికారులకు కూడా ఉండాలి. అప్పుడే ప్రజలు అధికారులను విశ్వసిస్తారు. లేని పక్షంలో ప్రజలు ఎక్కడికక్కడ ఎదురు తిరిగే పరిస్థితి నెలకొనే అవకాశం లేకపోలేదు. మరి జిల్లా స్థాయి అధికారులు ఆదర్శంగా ఉంటారా.. సామాన్యులైనా, అధికారులైనా ఒకటే అని పోలీసులు అధికారుల నుంచి కూడా ముక్కు పిండి ఫైన్లు వసూలు చేస్తారా..? అనేది వేచి చూడాలి మరి..

Advertisement

Next Story