Theenmar Mallanna: ఈ రాష్ట్రంలో ఇదే చివరి ఓసీ ప్రభుత్వం.. తీన్మార్ మల్లన్న మరోసారి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
Theenmar Mallanna: ఈ రాష్ట్రంలో ఇదే చివరి ఓసీ ప్రభుత్వం.. తీన్మార్ మల్లన్న మరోసారి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ల పేరుతో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఎంపీలంతా ముక్తకంఠంతో స్పందించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇటీవల కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్పనంగా వేలాది ఉద్యోగాలను బీసీల ఫ్లేట్లలో నుంచి తీసుకెళ్లినట్లుగా ఉందన్నారు. దీన్ని సవరించాల్సిందేనని డిమాండ్ చేశఆరు. ఓబీసీల హక్కుల సాధన కోసం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BC Intellectuals Forum) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామన్నారు. మంగళవారం ఢిల్లీలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, వట్టె జానయ్యతో కలిసి తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. ఓబీసీల (OBC Reservations) హక్కులు, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం కోసం తామంతా ప్రయత్నం చేస్తామన్నారు. ఈనెల 11న ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ఓబీసీల జాతీయ సదస్సును దిగ్విజయం చేయాలని రాష్ట్ర ఓబీసీ నేతలను కోరారు.

రాబోయేది బీసీ సర్కారే:

తెలంగాణలో రాబోయేది బీసీ సర్కారేనని ఈ రాష్ట్రంలో ఇదే చివరి ఓసీ ప్రభుత్వం అని తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్ లో అన్ని పార్టీలు, అందరు నాయకులను కలుపుకుని బీసీ ఉద్యమాలతో మరింత ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ తో (M K Stalin) వివిధ నాయకులు భేటీ కాబోతున్నామన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ నినాదం, మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని ఇవాళ్టి సదస్సు నిర్వహించుకోబోతున్నామన్నారు.

Advertisement

Next Story