- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ మున్సిపాలిటీలో డెఫ్ అండ్ డం మహిళకు ఘోర అవమానం..

దిశ, వైరా : అనేక వివాదాలకు కేంద్ర బిందువైన వైరా మున్సిపాలిటీలో డెఫ్ అండ్ డం (మూగ, చెవిటి) మహిళకు ఘోర అవమానం జరిగింది. వైరా మున్సిపాలిటీకు గత 8 నెలల క్రితం బదిలీ పై జూనియర్ అకౌంటెంట్ గా వచ్చిన సదరు మహిళకు నేటి వరకు మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ఆమె 8 నెలలుగా మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెఫ్ అండ్ డం మహిళ అకౌంటెంట్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేదనే నెపంతో ఆమెను పక్కన పెట్టారని మున్సిపాలిటీలోని ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. స్వయానా జిల్లా అదనపు కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న వైరా మున్సిపాలిటీలోనే మూగ, చెవిటి మహిళ పై తీవ్ర వివక్షత కొనసాగటం వివాదాస్పదమవుతుంది. అంతేకాకుండా వైరా మున్సిపాలిటీకు కొత్తగా మరో జూనియర్ అకౌంటెంట్ నియమించినప్పటికీ అతనికి నేటి వరకు బాధ్యతలు అప్పగించలేదు. మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ సెక్షన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తికి అనధికారికంగా అకౌంటెంట్ బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా అతనిని కమిషనర్ సంవత్సర కాలంగా అకౌంటెంట్ గా కొనసాగించడం విశేషం.
కమిషనర్ గారు.. ఇంత వివక్ష ఎందుకు..?
డెఫ్ అండ్ డం అయిన మహిళా ఉద్యోగినికి 8 నెలలుగా బాధ్యతలు అప్పజెప్పకుండా కమిషనర్ వివక్షత ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వమే అంగవైకల్యం ఉన్న వారి మానసిక ధైర్యం కోల్పోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అంగ వైకల్యం ఉన్న వారిని అవమానపరిచిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకుంటుంది. అయితే స్వయానా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి అయిన కమిషనరే అంగవైకల్యం ఉన్న మహిళ పై వివక్ష చూపించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 8 నెలలుగా ఆ మహిళకు ఎందుకు బాధ్యతలు అప్పగించలేదనే విషయం పై స్పెషల్ ఆఫీసర్ అయిన అదనపు కలెక్టర్ కూడా ఆరా తీయక పోవటం విశేషం. మున్సిపాలిటీలో తమ అడుగులకు మడుగులొత్తే ఓ జూనియర్ అసిస్టెంట్ ను ఎలాంటి ఉత్తర్వులు లేకుండా సంవత్సర కాలంగా అనధికారికంగా అధికారులు అకౌంటెంట్ గా పని చేయించటం వెనక అనేక అవినీతి అక్రమాలు ఉన్నాయని తెలుస్తోంది. తన విధులకే సక్రమంగా హాజరుకాని సదరు జూనియర్ అసిస్టెంట్ కు అనధికారిక బాధ్యతలు అప్పగించడం వెనుక ఎలాంటి లాభాపేక్ష ఉందనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.
ఇద్దరు జూనియర్ అకౌంటెంట్లు ఖాళీ..
వైరా మున్సిపాలిటీకు ప్రభుత్వం ఇద్దరు జూనియర్ అకౌంటెంట్లను నియమించింది. గత ఏడాది జులై నెలలో ఖమ్మం కార్పొరేషన్లో పనిచేస్తున్న ఆశాకుమారిని ప్రభుత్వం వైరా మున్సిపాలిటీ జూనియర్ అకౌంటెంట్ గా బదిలీ చేసింది. అదేవిధంగా డిసెంబర్ 18వ తేదీన గ్రూప్ ఫోర్ లో నూతనంగా ఉద్యోగం సాధించిన సుదీర్ ను వైరా మున్సిపాలిటీ జూనియర్ అకౌంటెంట్ గా ప్రభుత్వం నియమించింది. అయితే ఆశా కుమారిని నియమించి 8 నెలలు, సుధీర్ ను నియమించి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు కమిషనర్ వారికి బాధ్యతలు అప్పజెప్పకపోవటం విశేషం. డెఫ్ అండ్ డం మహిళ అయిన ఆశా కుమారికి అకౌంటెంట్ బాధ్యతలు అప్పగిస్తే ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించదనే నెపంతో కమిషనర్ నేటి వరకు ఆమెను ఖాళీగా ఉంచుతున్నారు. మరో అకౌంటెంట్ సుధీర్ ఉన్నప్పటికీ అతనికి నేటి వరకు బాధ్యతలు అప్పగించలేదు. అతను జూనియర్ కావటం వల్ల బాధ్యతలు అప్పగించడం లేదని అధికారులు చెబుతున్నారు.
అయితే తమ విధులకు సక్రమంగా హాజరుకాని ఇంజనీర్ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్ కు అనధికారికంగా అకౌంటెంట్ బాధ్యతలు అప్పగించారు. గత సంవత్సర కాలంగా అనధికారికంగా ఆయన ఈ విధులు నిర్వహిస్తున్నారు. అతనిని అకౌంటెంట్ గా నియమించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు కూడా లేవు. అయితే వైరా మున్సిపాలిటీలో కమిషనర్ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ పేరుతో తాను చెప్పిందే నిబంధన తాను చేసిందే శాసనమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒక మహిళను అంగవైకల్యాన్ని అడ్డుపెట్టి కించపరచడం పట్ల తీవ్ర దుమారమే రేగుతుంది. ఆ మహిళతో పాటు మరో జూనియర్ అకౌంటెంట్ ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి ఖాళీగా కూర్చుని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మానసిక ధైర్యాన్ని కుంగదీస్తూ మహిళకు బాధ్యతలు అప్పగించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కమిషనర్ ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ వ్యవహారమంతా అదనపు కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న వైరా మున్సిపాలిటీలో జరుగుతుండటంతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వైరా మున్సిపాలిటీలోని అధికారుల ఆగడాలను అరికడతారో లేదంటే ఎప్పటిలాగా చూసి చూడనట్లు వదిలేస్తారో వేచి చూడాల్సిందే.