మోడ్రన్‌గా తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్.. డిజైన్ ఫైనల్ చేసేదప్పుడే?

by Gantepaka Srikanth |
మోడ్రన్‌గా తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్.. డిజైన్ ఫైనల్ చేసేదప్పుడే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టు భవన నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ మరో రెండు వారాల్లో టెండర్లను పిలువనుంది. బిల్డింగ్​ డిజైన్ ఫైనల్​ చేసేందుకు నేడో, రేపో హైకోర్టు భవన నిర్మాణ కమిటీతో అధికారులు, బిల్డింగ్​ డిజైన్​ సంస్థ భేటీ కానుంది. నలుగురు సభ్యులతో కూడిన హైకోర్టు భవన నిర్మాణ కమిటీ ఓకే అంటే.. 24 నుండి 30 నెలల్లోనే నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ భవన నిర్మాణం కోసం రూ.2,583 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో టెండర్ల ప్రక్రియ దిశగా రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు సంస్థల నుండి సుమారు 15 కంపెనీలు ఈ భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా.. రోడ్లు, భవనాలశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి చివరికి టెక్‌ వన్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ అనే సంస్థను ఫైనల్​ చేసుకుంది. 36 లక్షల 81 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో 50 భవనాలను నిర్మించేందుకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగానే టెక్‌​ వన్​ ఇండియా సంస్థ భవన నిర్మాణ డిజైన్​‌ను తయారు చేసుకుని.. దీనిని ఫైనల్​ చేసుకునేందుకు రెండు మూడు రోజుల్లో హైకోర్టు భవన నిర్మాణ కమిటీతో భేటీ కానుంది.

హైకోర్టు స్థలంలో ఉండేవి ఇవే..

మొత్తం 36 లక్షల 81 చదరపు అడుగుల విస్తీర్ణ స్థలానికి గాను 25 లక్షల 81 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు భవన నిర్మాణం, కోర్టు కాంప్లెక్స్​, మెయిన్​‌ కోర్టు హాల్​, పబ్లిక్​‌ సర్వీస్​ బ్లాక్​, అడ్వకేట్స్​ జనరల్‌ ​బ్లాక్​, అడ్వకేట్స్​ జనరల్ ​ఎక్స్‌​టెన్షన్​ బ్లాక్​, అడ్వకేట్ చాంబర్ ​బ్లాక్​, అడ్మినిస్ట్రేటివ్​ బ్లాక్-​01, అడ్మినిస్ట్రేటివ్​ బ్లాక్-​01 ​ఎక్స్‌​టెన్షన్​, అడ్మినిస్ట్రేటివ్​ బ్లాక్​- 02, సెంట్రల్​ రికార్డు బ్లాక్​, ఆడిటోరియం బ్లాక్​, దేవాలయం, ఫైర్‌ ​స్టేషన్​, ఎర్త్‌ ​బర్మ్‌స్ట్రక్షర్​, సెక్యురిటీ గార్డు పోస్టు గది, ఎలక్ట్రికల్‌ సబ్ స్టేషన్​, జడ్జిల ​పార్కింగ్​ బ్లాక్​, అడ్వకేట్​ పార్కింగ్ బ్లాక్​, పబ్లిక్‌ ​పార్కింగ్​ ఏరియాను నిర్మించనున్నారు. 11 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కోర్టుకు వచ్చే పౌరుల సౌకర్యార్థం వాహన పార్కింగ్​ స్థలంగా కేటాయించనున్నారు. ఈ 50 భవనాలలో 40 వరకు జడ్జీల కాంప్లెక్స్‌​లుగాను, మరో10 హైకోర్టు కోసం కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిధుల వినియోగపరంగా చూస్తే రూ.2,583 కోట్ల నిధుల నుండి రూ.1,980 కోట్లు భవన నిర్మాణాలకు, రూ.603 కోట్లు హైకోర్టు వాదనలు వినిపించే ఫర్నీచ‌ర్‌కు వినియోగించనున్నారు.

నేడో రేపో కమిటీతో వన్ ఇండియా సంస్థ భేటీ?

కొత్త హైకోర్టు భవనం డిజైన్​, డీపీఆర్‌​లను వన్​ ఇండియా ప్రైవేటు ​లిమిటెడ్ ​కన్సల్టెన్సీ సంస్థ.. రోడ్లు, భవనాల శాఖ భవనాల శాఖ చీఫ్ ​ఇంజినీర్ ​రాజేశ్వర్‌‌రెడ్డికి అందజేయగా, దానిని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌​రెడ్డి ద్వారా సీఎం రేవంత్ వద్దకు చేర్చారు. దీనికి వారు ఓకే చెబుతూనే.. హైకోర్టు భవన నిర్మాణ కమిటీ ఆమోదం కూడా తీసుకోవాలని సూచించారు. దీంతో వారు నేడో, రేపో ఈ కమిటీతో భేటీ అయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా, అంతకు ముందు పలు డిజైన్లు ఖరారు చేసి ఆర్ అండ్ బీ అధికారులు, టెక్‌​వన్​ ఇండియా సంస్థ ప్రతినిధులు హైకోర్టు చీఫ్​ జస్టిస్ ​అలోక్ ​అరాధే ఆధ్వర్యంలోని జడ్జీల కమిటీకి పవర్​ పాయింట్ ప్రజెంటేషన్‌ ​ద్వారా చూపించగా, ఇందులో ఒకటి రెండు మార్పులు చేయాలని చెప్పడంతో.. వాటిని సరి చేసి రూపొందించి.. కమిటీని త్వరలో కలువనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత హైకోర్టు భవనం 1920 ఏప్రిల్​20న ఏడో నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్​ అలీ ఖాన్​ కాలంలో నిర్మించడంతో భవనం కొంత పాతగా కావడం ఒకటి కాగా, రాజధాని నగర నడిబొడ్డునే ఉండటంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీ​సీ బస్సులు, నగర పౌరుల రాకపోకలతో తరచూ ట్రాఫిక్​ జాం ఉంటోంది. వీటిని తొలగించుకోవాలంటే రాజధాని నడిబొడ్డున కాకుండా కొంత దూరంలోనే ఉండాలన్న ఉద్దేశంతో రాజేంద్రనగ‌ర్‌​లో సుమారు వంద ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టేందుకు సర్కారు ముందుకొచ్చింది.

Advertisement

Next Story