District Collector:సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు సేఫ్!

by Jakkula Mamatha |
District Collector:సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు సేఫ్!
X

దిశ ప్రతినిధి, కాకినాడ జిల్లా: చేపల వేటకు వెళ్లి అల్పపీడన కల్లోలిత సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ సంస్థల సహకారంతో సురక్షితంగా తీరానికి చేరారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.ఈ నెల 23వ తేదీన కాకినాడ పర్లోవపేటకు చెందిన నలుగురు మత్స్యకారులు వాడమొదలు ధర్మరాజు, వాడమొదలు పెంటయ్య, మల్లాడి నాని, మల్లాడి సతీష్ కలిసి పడవలో చేపల వేట నిమిత్తం బోటులో భైరవపాలెం వైపు సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో 25 నాటికన్ మైళ్ల దూరంలో వేట సాగిస్తుండగా, అల్పపీడనం కారణంగా పెనుగాలులతో కల్లోలితమైన సముద్రపు అలల్లో చిక్కుకుని తీరానికి చేరుకోలేక భైరవపాలెం సమీపంలోని రిలయన్స్ రిగ్ కు చెందిన పోల్ ఒకదానికి తమ పడవను తాళ్లతో కట్టి, సహాయం కోసం మత్స్యశాఖ అధికారులను ఫోన్ ద్వారా అభ్యర్థించారు.

జిల్లా కలెక్టర్ సూచనలతో మత్స్యశాఖ అధికారులు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయాన్ని కోరారు. కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ రక్షణ బృందాలు సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారుల ను రక్షించి, బోటుతో సహా సురక్షితంగా బుధవారం ఒడ్డుకు చేర్చాయి. కోరిన వెంటనే రక్షణ ఆపరేషన్ చేపట్టి ఎటువంటి అపాయం లేకుండా మత్స్యకారులను కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ సంస్థలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం తొలగిపోయే వరకు మత్స్యకారులెవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని, వాతావరణ శాఖ, మత్స్యశాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed