ఇక ఉన్నది నెల రోజులే! ముగుస్తోన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం

by Shiva |
ఇక ఉన్నది నెల రోజులే! ముగుస్తోన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ల టర్మ్ ముగియడంతో ఎలక్షన్స్ నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. మరో నెల రోజుల్లో ఈ జాబితాలో పట్టణ స్థానిక సంస్థలు కూడా చేరే అవకాశమున్నది. అందుకోసం పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లు, ఓటరు జాబితా, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, వార్డుల విభజన, ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా విలీనమైన గ్రామాలను వార్డుల విభజించడం వంటి కార్యక్రమాలను పురపాలక శాఖ అధికారులు వేగవంతం చేశారు.

గడువు జనవరి 26 వరకే..

రాష్ట్రంలో 143 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 129 మున్సిపాలిటీలు, 14 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 2024 ఫిబ్రవరిలో ఏర్పాటైంది. దీంతోపాటు మందమర్రి, మణుగూరు, పాల్వంచ, జహీరాబాద్ మున్సిపాలిటీలకు అనివార్యకారణాల వల్ల ఎన్నికలే నిర్వహించలేదు. 120 మున్సిపాలిటీలు, 8 మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం 26 జనవరి 2025న ముగియనుంది. ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గడువు మాత్రమే 28 జనవరి 2025న ముగియనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, జడ్చర్ల, సిద్ధిపేట, కొత్తూరు, నకిరకల్ మున్సిపాలిటీలకు సంబంధించిన గడువు 05 మే 2026న ముగియనుంది. అంటే మరో ఏడాది పాటు పాలకవర్గాలకు వెసులుబాటు ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మాత్రం 2026లో ఫిబ్రవరి పదో తేదీ వరకు పదవీకాలం ఉంది.

రిజర్వేషన్లు, వార్డుల విభజన

పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలకు ముందుగానే కొత్త మున్సిపాలిటీలు, ఆయా మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో వార్డుల విభజన చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను ప్రభుత్వం నుంచి బీసీ కమిషన్ కు ఇవ్వనున్నారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముందని సచివాలయ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటే ఓటరు జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story