Marine wildlife : జల చరాల జీవ వైవిధ్యం.. మన దేశంలోని మెరైన్ నేషనల్ పార్కులివే..

by Javid Pasha |   ( Updated:2024-12-26 14:22:40.0  )
Marine wildlife : జల చరాల జీవ వైవిధ్యం.. మన దేశంలోని మెరైన్ నేషనల్ పార్కులివే..
X

దిశ, ఫీచర్స్ : పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి జంతువులు ఉండే అభయారణ్యాలు, జాతీయ ఉద్యాన వనాల గురించి చాలా మందికి తెలుసు. మన భూమి అత్యంత వైవిధ్య భరితమైన వృక్షజాలం, జంతు జాలానికి నిలయంగా ఉంది. అయితే జల చరాలన జీవ వైవిధ్య సంరక్షణకోసం మన దేశంలో సముద్ర వన్యప్రాణుల అభయారణ్యాలు (మెరైన్ నేషనల్ పార్కులు) కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? నిజానికి ఈ భూమి 71% నీటిలో ఉన్నప్పుడు ఈ సముద్ర జీవుల గురించి, ముఖ్యంగా మెరైన్ నేషనల్ పార్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. ఇండియాలో మొత్తం 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 7, 516 కి.మీ. తీరప్రాంతాన్ని మెరైన్ పార్కులు విస్తరించి ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి?, వాటి ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరైన్ నేషనల్ పార్క్, గుజరాత్

భారత దేశంలో మొట్ట మొదటిసారిగా స్థాపించిన అతిపెద్ద సముద్ర వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది గుజారత్‌లోని మెరైన్ నేషనల్ పార్క్. ఇది అక్కడి సమద్ర భాగంలోని గల్ఫ్ ఆఫ్ కచ్‌(Gulf of Kutch)లో ఉంది. 163 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సముద్ర ఉద్యానవనంలో 52 తెలిసిన అందమైన పగడపు జాతులు, అనేక రకాల సముద్ర వృక్షజాలం, జంతుజాలం, డాల్ఫిన్లు, సొరచేపలు, తాబేళ్ల ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఔత్సాహికులు వీటిని చూసేందుకు వస్తుంటారు. గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి ఇక్కడికి రెంటల్ బోట్‌లలో చేరుకోవడం చాలా ఈజీ.

మహాత్మాగాంధీ మెరైన్ నేషనల్ పార్క్

అండమాన్ నికోబార్ దీవులలో చూడముచ్చటైన సముద్ర జీవజాలంతో కళకళలాడుతూ ఉంటుంది మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. 1983లో పగడపు దిబ్బలను, సముద్రపు తాబేళ్లను, ఇతర సముద్ర జీవులను సంరక్షించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. మొత్తం 15 ద్వీపాలతో విస్తరించి ఉన్న ఈ సముద్ర జీవుల ఉద్యానవనం అందమైన ప్రకృతి దృశ్యంగా పేర్కొంటారు. దేశంలోని అత్యుత్తమ స్కూబా డైవింగ్ స్పాట్‌లకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడ అందమైన సముద్ర వృక్షజాలాన్ని కూడా చూడవచ్చు.ఇక్కడి గ్లాస్ - బాటమ్ బోట్‌లో పార్కును తిలకించడం మధురానుభూతిని కలిగిస్తుంది.

గల్ఫ్ ఆఫ్ మన్నార్, మెరైన్ నేషనల్ పార్క్

తమిళనాడులోని రామేశ్వరం జిల్లాల్లో ఉన్న అందమైన మెరైన్ నేషనల్ పార్క్.. గల్ఫ్ ఆఫ్ మన్నార్. వాస్తవానికి ఇది తమిళనాడు, శ్రీలంక మధ్య గల గల్ఫ్ ఆఫ్ మన్నా బయోస్పియర్ రిజర్వ్‌లో ఉంది. తూత్తుకుడి అండ్ ధనుష్కోడి (Thoothukudi and Dhanushkodi) మధ్య 160 కి. మీ. విస్తీర్ణంలో ఉంది. కాగా ఈ మెరైన్ పార్క్ సముద్రపు గడ్డి, వివిధ రకాల పగడాలు, అందమైన చేపలు, డాల్ఫిన్‌లు, బ్లూ వేల్స్ వంటి సముద్ర వృక్షజాలం, జంతు జాలానికి నిలయంగా, సపోర్ట్‌గా ఉంది.

రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్

అండమాన్ నికోబార్ దీవుల్లోని మరో అందమైన సముద్ర జీవుల స్థావరం పేరు రాణి ఝాన్సీ(Rani Jhansi) మెరైన్ నేషనల్ పార్క్. దీనిని 1996లో ఏర్పాటు చేశారు. అందమైన పగడపు దిబ్బలు, నీలి మడుగులు, మొసళ్లు, ఆలివ్ రిడ్లీ (Olive Ridley and leatherback) అండ్ లెదర్ బ్యాక్ వంటి సముద్ర తాబేళ్లు ఇక్కడ ఆకట్టుకుంటాయి. వివిధ రకాల మడ అడవులకు కూడా ఈ పరిసర ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ మెరైన్ పార్క్ సముద్రపు ఆవులు (sea cows) అని పిలువబడే దుగోంగ్‌ల(dugongs)కు ముఖ్యమైన స్థావరం.

గహిర్‌మాత సముద్ర అభయారణ్యం

ఒడిశాలోని గహిర్‌మాత మెరైన్ అభయారణ్యం (Gahirmatha Marine Sanctuary) సముద్ర జీవ వైవిధ్యానికి నిలయం. ఇక్కడ 1.5 లక్షలకు పైగా ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు ఉన్నాయి. అలాగే 1,435 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గహిర్మాత తీరంలో అనేక తాబేళ్లు గూడు కట్టుకుంటాయి. కాగా రిడ్లీ సముద్ర తాబేళ్లు ప్రతీ సంవత్సరం గూడు కట్టుకోవడానికి ఒడిశా తీర ప్రాంతాలను మాత్రమే ఎంచుకుంటాయి. అందుకోసం ఇవి దక్షిణ పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహా సముద్రంలోని ఈ భాగానికి వలస వస్తాయి. మడ అడవులు వాటికి సురక్షితమైన ప్రదేశంగా ఉంది. కాగా గహిర్ మాత సముద్ర వన్యప్రాణి ఉద్యానవనాన్ని ఒడిశా ప్రభుత్వం సంరక్షిస్తోంది.

మాల్వాన్ మెరైన్ వైల్డ్ లైఫ్, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని మాల్వాన్ మెరైన్ వైల్డ్ లైఫ్ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ సముద్ర వన్యప్రాణుల ఉద్యానవనంలో రకరకాల చేపలు, డాల్ఫిన్‌లు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి డాల్ఫిన్‌లు భారతదేశంలోనే చాలా ప్రత్యేకం. ఈ మెరైన్ పార్క్ కూడా గొప్ప స్నార్కెలింగ్ అండ్ డైవింగ్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది మరో పార్క్ సింధుదుర్క్ (Sindhudurg )కు సమీపంలో ఉంది. కేవలం 3.2 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ సముద్ర జీవవుల సంరక్షణకు, వైవిధ్యానికి ప్రసిద్ధి గాంచింది.

Advertisement

Next Story

Most Viewed