చేపల సాగు.. లాభాలు బాగు..

by Sumithra |
చేపల సాగు.. లాభాలు బాగు..
X

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మత్స్య సంపద రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రాకు ధీటుగా, వ్యసాయానికి అనుబంధంగా ఉమ్మడి జిల్లాలో చేపల పంపకం జోరుగా సాగుతోంది. అనేక రకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్లలో ఉపరితల నీటి లభ్యత పెరగడం, దీనికి తోడుగా భూగర్భ జలాలు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్ల నుంచి దాదాపుగా 45 నుంచి 50 మంది రైతులు చేపల సాగుకు మొగ్గు చూపారు. దుగ్గొండి, తొగరురామయ్యపల్లి, చాపలబండ, నల్లబెల్లి, గొల్లపల్లి, పరకాల, మహ్మద్ గౌస్‌పల్లి, కమలాపూర్, మొగుళ్లపల్లి, ఐనఓలు, బొల్లికుంట, ఏనుమాముల, జాఫర్ ఘడ్, తిడుగు, ముద్దునూరు, చెన్నారావుపేట, సూరిపెల్లి, కమ్మపల్లి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పంటలకు పనిచేయని, నీరు నిల్వ ఉండే సౌడు భూములు గల రైతులు తమ పంట పొలాలను చేపల చెరువులుగా మార్చుకున్నారు. ఆయా భూముల్లో చెరువులు తవ్వి దాదాపుగా 350ఎకరాల్లో చేపలు పెంచుతూ జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో కొంతమంది కొర్రమీను (బొమ్మ చేపలు) తెల్ల చేపలు, జెల్లలు, నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి, పెద్ద చేపలు పెంచుతున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన అనేక మందికి సైతం ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఈ చేపల సాగుకు రైతులకు ఆర్థిక సహాయంతో పాటు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని, అప్పుడే చాలామంది రైతులు ఈ చేపల సాగు వైపు మొగ్గు చూపుతారని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, దుగ్గొండి : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మత్స్య సంపద రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రాకు ధీటుగా, వ్యవసాయానికి అనుబంధంగా ఉమ్మడి జిల్లాలో చేపల పెంపకం జోరుగా సాగుతోంది. అనేక రకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్లలో ఉపరితల నీటి లభ్యత పెరగడం, దీనికి తోడుగా భూగర్భ జలాలు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్ల నుంచి దాదాపుగా 45 నుంచి 50 మంది రైతులు చేపల సాగుకు మొగ్గుచూపారు. దుగ్గొండి, తొగరురామయ్యపల్లి, చాపలబండ, నల్లబెల్లి, గొల్లపల్లి, పరకాల, మహ్మద్ గౌస్‌పల్లి, కమలాపూర్, మొగుళ్లపల్లి, ఐనఓలు, బొల్లికుంట, ఏనుమాముల, జాఫర్ ఘడ్, తిడుగు, ముద్దునూరు, చెన్నారావుపేట, సూరిపెల్లి, కమ్మపల్లి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పంటలకు పనిచేయని, నీరు నిల్వ ఉండే సౌడు భూములు గల రైతులు తమ పంట పొలాలను చేపల చెరువులుగా మార్చుకున్నారు. ఆయా భూముల్లో చెరువులు తవ్వి దాదాపుగా 350 ఎకరాల్లో చేపలు పెంచుతూ జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో కొంతమంది కొర్రమీను (బొమ్మ చేపలు) తెల్ల చేపలు, జెల్లలు, నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి మరియు పెద్ద చేపలు పెంచుతున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన అనేక మందికి సైతం ఉపాధి కల్పిస్తున్నారు.

ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించాలి..

చేపల పెంపకానికి ప్రభుత్వ పరంగా అందుతున్న ఆర్థిక, సహాయ సహకారం మిగతా రంగాలతో పోల్చితే చాలా తక్కువగా అందుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా వ్యవసాయ పంటలకు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ కూడా చేపల సాగుకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించాలన్న డిమాండ్ సైతం లేకపోలేదు. విద్యుత్ ఉచితంగా సరఫరా చేయడం వల్ల చేపల ఉత్పత్తికి వ్యయం తగ్గుతుంది. అంతేకాకుండా నాణ్యమైన చేపల విత్తనాన్ని రాష్ట్ర మత్స్యకారులకు తక్కువ ధరకే ఇవ్వగలుగుతారు. దీని ద్వారా మత్స్యకారులు చేపడుతున్న చేపల చెరువులలో చేపల ఉత్పత్తి బాగా పెరిగి ప్రభుత్వం చేపట్టే చేపల పంపిణీ ద్వారా నాణ్యమైన చేపలు అంది మత్స్య సహకార సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంది. ఉచిత చేప పిల్లల పంపిణీకి కావాల్సిన చేప పిల్లలను ముందుగానే ప్రైవేట్ చెరువుల రైతులతో బై బ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల నాణ్యమైన విత్తనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించగలుగుతారు.

కొర్రమీను సాగు లాభదాయకం..

చేపల్లో కెల్లా అత్యంత ఖరీదైన చేప కొర్రమీను. ఔషధ గుణాలతో పాటు రుచిగా ఉండడంతో మాంసం ప్రియులు దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. రైతులు తమ పొలాల్లో వ్యవసాయానికి బదులుగా చేప పిల్లల సాగు చేస్తూ లాభాలను చవి చూస్తుండడం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ చెరువులో కొర్రమీను సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. చేప పరిమాణం ఆధారంగా మేత రెండు అంగుళాల నుంచి 3 అంగుళాల వరకు ఉన్న చేపలకు ఒక్కో దశకు ఒక్కో రకమైన మేతను అందిస్తారు. 6నుంచి 16 సైజు వరకు గల మిల్లెట్స్ న్యూట్రిషన్స్‌ను కలిగిన మేతను ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు దఫాలుగా అందిస్తారు. అన్ని పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా సాధారణంగా ఆక్వా సాగులో రైతులను వాతావరణ పరిస్థితులు వెంటాడుతుంటాయి. అయితే కొరమీను సాగు చేసే రైతులకు ఇటువంటి సమస్యలు ఉండవు. ఇవి ఆక్సిజన్, ఎంత ఎండైననా తట్టుకొని జీవించగలవు. బోరు, చెరువు మంచినీటిలోను ఆరోగ్యంగా పెరుగుతాయి.

కొరమీను పెంపకం మా ప్రత్యేకత.. ఆకుల స్వప్నాశ్రీనివాస్, తొగరురామయ్యపల్లి, దుగ్గొండి.

మాకున్న వ్యవసాయ భూమిలో చాపల చెరువులు తవ్వి కొరమీను చేపల పెంపకం చేస్తున్నాం. దీనిలో లాభాలు ఉంటాయని తెలుసుకుని చేపల పెంపకాన్ని మొదలుపెట్టాం. రెండు అంగుళాల సైజు ఉన్న చేప పిల్లలను తెచ్చి తొమ్మిది నెలల పాటు ప్రత్యేకమైన ఫీడ్‌తో పెంచుతాం. కిలో, కిలోన్నర సైజుకు రాగానే దుగ్గొండి నుంచి వరంగల్, హైదరాబాద్, బెంగళూరు వంటి తదితర ప్రాంతాలకు కొరమీను చేపలను ఎగుమతి చేస్తున్నాం. మన రాష్ట్రంలో కోరమీను (బొమ్మ చేప)లకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొమ్మ చేపలు చాలా తక్కువ. ఈ బొమ్మ చేపల ఉత్పత్తిని మన రాష్ట్రంలో పెంచాలంటే రైతులకు ఆర్థిక సహాయంతో పాటు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే చాలామంది రైతులు ఈ బొమ్మ చేపల సాగు వైపు మొగ్గు చూపుతారు.

కోల్డ్ స్టోరేజ్, కనీస సౌకర్యాలు కల్పించాలి... గాడిపల్లి రజిత, తిడుగు, జాఫర్‌ఘడ్.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీకి దాదాపుగా 250కోట్ల నాణ్యమైన చేప పిల్లలు అవసరం అవుతాయి. చేప పిల్లల ఉత్పత్తి జరగాలంటే మన రాష్ట్రంలో దాదాపుగా 2500ఎకరాల్లో చేప పిల్లలను ఉత్పత్తి చేయాలి. పట్టుబడి చేసిన చేపలను నిల్వ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజీ, చేపల రవాణా వాహనాలను, ఐస్ ఫ్యాక్టరీలను అభివృద్ధి చేయాలి. దీంతో ఈ ప్రాంతంలో రైతులు పండించే రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

Advertisement

Next Story