- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dharani: ‘స్లాట్స్’ సొమ్ము స్వాహా..! క్యాన్సిల్ చేసినా రీఫండ్ కాని ‘ధరణి’ ఫీజు, స్టాంప్ డ్యూటీ
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ ప్రజలను నిలువు దోపిడీ చేసింది. ఒక్కసారి ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సిందే. ఏదైనా కారణంతో రీ షెడ్యూల్ చేసుకునే అవకాశముంది. అయితే పూర్తిగా ఆ స్లాట్ ను క్యాన్సల్ చేసుకుంటే మాత్రం.. చెల్లించిన ఫీజు, స్టాంప్ డ్యూటీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో గ్యారంటీ లేదు. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత 2021–22 సంవత్సరంలో క్యాన్సల్ చేసుకున్న స్లాట్స్ కు సంబంధించి మాత్రమే సొమ్మును వాపస్ చేశారు. ఆ తర్వాత రద్దు చేసుకున్న స్లాట్స్ అమౌంట్ రూ. వందల కోట్లు నేటికీ పెండింగులో ఉంది. బాధితులు టోల్ ఫ్రీ నంబరుకు పోన్ చేస్తే.. టైంబాండ్ చెప్పలేమని సమాధానమొస్తున్నది. గతేడాది డిసెంబరు 13న ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడు ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. అప్పుడే ఆ అమౌంట్ ని రిటర్న్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కానీ నేటికీ ఆ సొమ్మును రిటర్న్ చేసే మెకానిజం ఏర్పాటు కాలేదు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చే క్రమంలోనైనా తమ సొమ్ము ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
అక్షరం తప్పుపోయినా..
ధరణి పోర్టల్ లో ఫీజు చెల్లించిన తర్వాతే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో ఒక్క అక్షరం తప్పుపోయినా సరిదిద్దలేరు. దీంతో కట్టిన ఫీజు ధరణి హుండీల్లో వేసినట్లే. రీఫండ్ అనేది కష్టమే. సొమ్ము ఏ ఖాతాలోకి వెళ్లింది? ఎవరిని అడగాలి? తిరిగి ఏ అధికారి రిటర్న్ చేస్తారు? రీఫండ్ డబ్బులు చెక్కుల రూపంలో ఇస్తారా? చెల్లించిన వారి ఖాతాలోనే జమ చేస్తారా? అలా చేస్తే బాధితుడి నుంచి బ్యాంకు ఖాతా వివరాలు తీసుకునేదెవరు? ఎవరికి ఇవ్వాలి? ఇవన్నీ ఎవరూ తీర్చలేని సందేహాలే. తహశీల్దార్ నుంచి కలెక్టర్ దాకా అందరి నుంచి ‘మాకు తెలియదు’ అనే సమాధానమే వస్తున్నది.
సవరణ కోరితే.. సొమ్ము మాయం
ధరణి పోర్టల్ కు ముందున్న వ్యవస్థలో ఏదైనా పొరపాటుగా టైప్ చేస్తే సవరించుకునే అవకాశం ఉండేది. కానీ ధరణి పోర్టల్ లో ఆ చాన్స్ ఇవ్వలేదు. మీ సేవా కేంద్రం నిర్వాహకులు లేదా దరఖాస్తుదారుడు సొంతంగా స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు పొరపాట్లు సహజం. ఒక్క చిన్న తప్పు చేసినా స్లాట్ కోసం చెల్లించిన ఫీజు మొత్తం రిటర్న్ వచ్చే అవకాశాల్లేకుండా చేశారు. ఐదెకరాల భూమి క్రయ విక్రయానికి రూ.13 వేల వరకు చెల్లించాలి. ఆ సొమ్మంతా తిరిగి వస్తుందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొన్నది. అలాగే అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకపోతే మరోరోజు చేసుకునే వీలుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎవరైనా వివిధ కారణాలతో రాలేకపోయినా నష్టం వాటిల్లేది కాదు. ఇప్పుడేమో అనుకున్న సమయానికే రావాలి.
మీసేవా కేంద్రాలకు ఇబ్బంది
నగర శివారులోని ఓ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు వివిధ కారణాలతో 30 స్లాట్లు రద్దు చేశాడు. అయితే చెల్లించిన సొమ్ము ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. దాంతో తన ఖాతా నుంచి చెల్లించిన రూ.లక్షన్నరకు పైగా అమౌంట్ ధరణి పోర్టల్లో ఇరుక్కుపోయింది. అధికారులేమో తమకు తెలియదంటున్నారు. కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేసినా ఫలితం లేకుండాపోయింది. చలాన్ల ద్వారా చెల్లించిన ఫీజు రూ.151 నుంచి రూ.43,797 వరకు ఉంది. తాను స్లాట్ల బుకింగ్ ద్వారా సంపాదించిన సొమ్మంతా పోయిందని బాధ పడుతున్నాడు. ఫీజు రావడం లేదంటూ రోడ్డెక్కే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ రెవెన్యూ అధికారులు తన కేంద్రాన్ని రద్దు చేస్తారేమోనని భయం. చిన్న మండల కేంద్రంలో మీ సేవా కేంద్రం నిర్వహణతోనే కుటుంబాన్ని పోషిస్తున్న తాను.. ఈ సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని వాపోతున్నాడు. ఇలా మీ సేవా కేంద్రం నిర్వాహకులతో పాటు ఎంతో మంది రైతులు నష్టపోయారు. ఏ అధికారి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయాలో కూడా టోల్ ఫ్రీ నంబరు ద్వారా సమాచారం ఇవ్వడం లేదు.
భూ భారతిలో మార్పు చేయాలి
సామాన్యులకు అనుకూలంగా రూపొందించిన భూ భారతి చట్టం అమలు చేసేటప్పుడైనా స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీజు వాపస్ చేసే వ్యవస్థను రూపొందించాలి. తప్పొప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించాలి. లేదంటే చిన్న పొరపాటు చేసినా రూ.లక్షల్లో సొమ్ము బ్లాక్ అవుతుంది. కొత్త పోర్టల్ ని రూపొందించేటప్పుడు సొమ్ము వాపస్ తీసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవేళ సాధారణ ఫీజులు రిటర్న్ చేయకపోయినా స్టాంప్ డ్యూటీ మాత్రం పొందేందుకు మాడ్యూల్ ని తీర్చిదిద్దాలని మీ సేవా నిర్వాహకులు కోరుతున్నారు.