Action Plan: జడ్పీ పీఠాలపై కాంగ్రెస్ కన్ను! ఉత్తర తెలంగాణలో గెలిచేలా వ్యూహాలు

by Shiva |
Action Plan: జడ్పీ పీఠాలపై కాంగ్రెస్ కన్ను! ఉత్తర తెలంగాణలో గెలిచేలా వ్యూహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ పీఠాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని జడ్పీలన్నీ తమకే వస్తాయనే ధీమాతో ఉన్న హస్తం పార్టీ.. ఉత్తర తెలంగాణలోని స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణపై టీపీసీసీ ఫోకస్ పెంచింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ జడ్పీటీసీ స్థానాలు దక్కించుకొని, చైర్మన్/చైర్ పర్సన్ సీట్లలో హస్తం పార్టీ జెండా ఎగురవేయాలని టీపీసీసీ ఆలోచిస్తున్నది. ఇందుకోసం ఇంటర్నల్‌గా వ్యూహాలు అమలు చేయాలని ఆలోచిస్తున్నది. ఉత్తర తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం అత్యధికంగా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆయా డిస్ట్రిక్ట్‌లలో సర్పంచ్, ఎంపీటీసీల కంటే జడ్పీటీసీలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని టీపీసీసీ ఇటీవల జూమ్ మీటింగ్ ద్వారా డీసీసీలకు సూచించింది.

జడ్పీ పీఠం దక్కించుకోవడం వల్ల ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్న జిల్లాల్లోనూ కాంగ్రెస్ తన ప్రాధాన్యతను పెంచుకోవచ్చనే అభిప్రాయంలో ఉన్నది. జిల్లాస్థాయిలో పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా పర్యటనలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘స్థానిక’ ఎన్నికల్లో జడ్పీ పీఠాలను దక్కించుకోవాల్సిందే అంటూ స్థానిక లీడర్లకు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా జనాల్లో గుర్తింపు ఉన్న క్షేత్రస్థాయి లీడర్లపై ఫోకస్ పెట్టారు. జిల్లా ముఖ్య నేతలంతా కలిసి జడ్పీటీసీ టికెట్ల కోసం పేర్లను ప్రతిపాదించాల్సిన అవసరం ఉన్నదని పీసీసీ సూచించింది. పార్టీ కోసం పనిచేసినోళ్లలో జనాల్లో మంచి పేరు పొందిన నేతలను సెలక్ట్ చేయాలని ఆదేశించారు.

ఆ నేతలతోనూ ఇంటర్నల్ లింక్..?

కాంగ్రెస్ పార్టీ తన ఇంటర్నల్ సర్వే ద్వారా పార్టీలకు అతీతంగా వ్యక్తుల ఇమేజ్‌ను గుర్తిస్తుంది. ఆ వ్యక్తులను కాంగ్రెస్ నుంచే జడ్పీటీసీగా పోటీ చేయించాలని టార్గెట్ పెట్టుకున్నారు. పార్టీ, క్యాస్ట్, ఇతర సమీకరణాల ఆధారంగా టికెట్లు ఇవ్వడం వీలు కాని నేపథ్యంలో ఆయా నేతలతో ఇంటర్నల్ లింక్స్ పెట్టుకోనున్నారు. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో జడ్పీటీసీలు ఏ పార్టీ లీడర్లు గెలిచినా, కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన లీడర్లతో ఇంటర్నల్‌గా పీసీసీ రహస్యంగా చర్చలు చేయనున్నట్టు సమాచారం. ఇతర పార్టీ నేతలతోనూ సన్నిహితంగా మెలిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ వ్యూహాన్ని బీజేపీ, బీఆర్ఎస్ శాసనసభ్యులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయనున్నట్టు వినికిడి. త్వరలో ఉత్తర తెలంగాణలో జిల్లాల్లో ‘పార్టీ ప్రయారిటీ’ పేరిట మీటింగ్స్‌ను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. సంక్రాంతి తర్వాత ఆ జిల్లాల్లో టూర్ ఉండొచ్చని ఓ నేత తెలిపారు.

గతంలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్

రాష్ట్రవ్యాప్తంగా 32 మంది జడ్పీ చైర్మన్లు ఉండగా, గతంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్‌కు కనీసం ఒక్క జడ్పీ పీఠం కూడా దక్కలేదు. కాంగ్రెస్ పవర్‌లో ఉన్నందున ఇప్పుడు సీన్ రివర్స్ చేయాలని పార్టీ ఆలోచిస్తున్నది. బీఆర్ఎస్‌ను జీరోకే పరిమితం చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని పార్టీ నేతలతో ప్రస్తావించినట్టు సమాచారం. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్‌ను భూ స్థాపితం చేసేలా పార్టీ పనిచేయాలని సూచించారు. గతంలో ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట్, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్కో జడ్పీటీసీ స్థానాల్లోనే గెలిచింది. మిగతా స్థానాల్లో గులాబీ పార్టీ విజయఢంకా మోగించింది. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్, వరంగల్ రూరల్ జిల్లాల్లోని అన్ని జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 538 జడ్పీటీసీ స్థానాలుండగా, గతంలో 449 స్థానాల్లో బీఆర్ఎస్ గెలువగా, ఇతర పార్టీలు మిగతా సీట్లను సొంతం చేసుకున్నాయి.

Advertisement

Next Story