- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ తెరపైకి నావల్ ప్రాజెక్టు.. స్పీడ్ పెంచిన కర్ణాటక
దిశ, తెలంగాణ బ్యూరో: తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నావలి ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై చర్చిద్దాంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్ కు కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. తుంగభద్రలో పూడికను తొలిగించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందని, దాన్ని అలాగే ఉంచి, తుంగభద్ర ప్రాజెక్టుకు అనుసంధానంగా మరో ప్రాజెక్టును నిర్మిస్తే తక్కువ వ్యయంలో పూర్తవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు దీనిపై ఇంకా ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు సంబంధించిన డీపీఆర్ ను కర్ణాటక ప్రభుత్వం బోర్డులకు కూడా సమర్పించింది. దిగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరుగకుండా.. నిల్వ నీటిని వాడుకునేలా నిర్మాణం చేస్తామంటూ వెల్లడించింది. ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలు తెలిపిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం మరోమారు తెలిపింది.
తుంగభద్ర జలాశయానికి ఎగువన వరద కాల్వతో పాటు 52 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 'నావలి'బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం డీపీఆర్ రెడీ చేసింది. ఇప్పటి వరకే పూడికతో తుంగభద్ర నిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.885 టీఎంసీలకు పడిపోందని, ఈ నేపథ్యంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.కేవలం వరదల సమయంలో జలాశయం నుంచి వరద ప్రవాహ కాల్వ ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీళ్లను మళ్లిస్తామని, ఎగువ నుంచి ఎక్కువ వచ్చే నీటిని ఎగువ నావలి జలాశయంలో నిల్వ చేసుకుని, అవసరమైన సమయంలో దిగువకు వదులుతామని వివరించారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఎక్కడంటే అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చిద్దామంటూ కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. సీఎం, మంత్రులు కూడా వస్తారని పేర్కొన్నారు. తుంగభద్ర కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో వరద కాల్వ, కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తెలుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నీటి అవసరాలు, వినియోగాన్ని కూడా వివరించారు. కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాల్లోని అన్ని కాల్వలకు కృష్ణా ట్రిబ్యునల్–1 ఆవిరి నష్టాలను కలుపుకొని 230 టీఎంసీలను కేటాయించిందని, ఆవిరి నష్టాలు పోగా 212 టీఎంసీల నీళ్లను వాడుకోవాల్సి ఉండగా, 1976–77 నుంచి 2017–18 మధ్య కాలంలో ఏటా సగటున 164.4 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నామని, ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో పాటు అకస్మాత్తుగా స్వల్ప కాలం వరదలు పోటెత్తడం, కేవలం జూలై, ఆగస్టు నెలల్లోనే భారీ ప్రవాహం ఉండడంతో ఈ నీళ్లను నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని కర్ణాటక ప్రభుత్వం ఇదివరకే వివరించింది.
ప్రస్తుతం నీటి నిల్వ, వినియోగం పెరుగాలంటే తుంగభద్రలో పూడిక తొలగించడం లేదా అదనపు నిల్వల కోసం కొత్త రిజర్వాయర్ నిర్మించడం ఒక్కటే పరిష్కారమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనను రెండేండ్ల కిందటే చేశామని, కానీ రెండు రాష్ట్రాల నుంచి రిప్లై రావడం లేదని, ఇప్పుడు ఇద్దరు సీఎంలు అంగీకరిస్తే చర్చిద్దామంటూ ఇటీవల కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. తుంగభద్రలో పూడికను తొలగించడానికి రూ.12,500 కోట్ల వ్యయం అవుతుందని, నావలి వద్ద 492 అడుగుల గరిష్ట నిల్వ సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌ఎల్)తో 52 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.9,500 కోట్లు, 486 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మాణానికి రూ.6,000 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్ ను కూడా పంపించారు.
ఈ డీపీఆర్ ను తెలుగు రాష్ట్రాలతో పాటుగా కృష్ణా బోర్డుకు కూడా సమర్పించినట్లు జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టుతో నష్టాలు ఉంటాయా.. అనే అంశంపై వివరాలు సేకరిస్తోంది. ఈ వివరాలు తీసుకున్న తర్వాతే కర్ణాటకకు రిప్లై ఇవ్వనున్నారు.