మత్తుకు బానిసలవుతోన్న యువత.. పట్టణాల నుంచి పల్లెలకు గంజాయి సరఫరా

by Anjali |
మత్తుకు బానిసలవుతోన్న యువత.. పట్టణాల నుంచి పల్లెలకు గంజాయి సరఫరా
X

దిశ, మిర్యాలగూడ: యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించకపోవడం తో చెడు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి, మత్తు టాబ్లెట్లకు అలవాటు పడుతున్న యువకులు, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కలలను కలలుగానే మిగిలిస్తున్నారు. గంజాయి మత్తులో ఊగిసలాడుతూ గ్రూపులుగా ఏర్పడి గొడవలకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతుంది. దీనిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ పట్టణాల నుంచి పల్లెల్లో కూడా గంజాయి సరఫరా అవుతుంది. ఇటీవల కాలంలో పోలీసులు 23 మంది గంజాయి అక్రమ రవాణా నిందితులను అరెస్టు చేశారు. అందులో 21 మంది 25 సంవత్సరాల లోపు వారే కావడంతో యువత గంజాయి కి ఏ మేరకు అలవాటు పడిందో అర్థం అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఆంధ్రాలోని మాచర్ల, గురజాల లాంటి ప్రాంతాల నుంచి గంజాయి ఇక్కడికి అక్రమ రవాణా జరుగుతుంది. పోలీసులు సరిహద్దు ప్రాంతాలలో పర్యవేక్షణ లేకపోవడం వలన గంజాయి మిర్యాలగూడ పట్టణంలో వివిధ చోట్ల విరివిగా లభిస్తున్నట్లు సమాచారం.

పట్టణాల నుంచి పల్లెలకు

గత పది సంవత్సరాల క్రితం ఎవరో కొంతమంది మాత్రమే గంజాయిని సేవించేవారు. ప్రస్తుతం అది వ్యసనంగా మారి విద్యార్థుల నుంచి మొదలుకొని ముసలి వారి వరకు గంజాయిని వాడుతున్నారు. పట్టణాలలో కనిపించే గంజాయి చివరకు పల్లెల్లోకి చేరింది. దీంతో పాఠశాల విద్యార్థుల నుంచి గంజాయి వాడటం అలవాటుగా మారిపోతుంది. గంజాయి వ్యాపారులు చాక్లెట్ రూపంలో కూడా విక్రయాలు చేస్తున్నారు. విషయం తెలవని కొందరు గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను కోల్పోతున్నారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాలలో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి గంజాయి నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.

మత్తుకు బానిసలు అవుతున్న యువత

గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు అవుతున్నారు. గంజాయి సేవించే వారిలో ఎక్కువగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారు కావడం విశేషం. చిన్న వయసులోనే గంజాయి కి అలవాటు పడి తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. గంజాయి వాడకం అనంతరం గ్రూపులుగా ఏర్పడి గొడవలకు దిగి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో మిర్యాలగూడ పట్టణంలో గంజాయి సేవించిన యువకులు వీధుల్లో గొడవలకు దిగి వీరవిహారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక యువత జైలు పాలవుతున్నారు.

పట్టించుకోని తల్లిదండ్రులు

తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వలన యువత మత్తుకు బానిస అవుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించడం లేదు. దీంతో 18 సంవత్సరాల నుంచి యువకులు గంజాయి మత్తుకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని పోలీసులు కోరుతున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థులు డబ్బు అవసరం ఉందని తల్లిదండ్రులకు చెప్పి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెడితేనే గంజాయి నివారణ చర్యలు చేపట్టగలమని అధికారులు పేర్కొంటున్నారు.

నిర్మానుష ప్రదేశాలే అడ్డాలు

గంజాయి అమ్మకాలు, కొనుగోలు నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా మార్చుకున్నారు. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం నిర్మానుష్య ప్రదేశాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు నిర్మానుష్య ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఆంధ్రలోని కొందరి వ్యక్తుల సహకారంతో ఉమ్మడి జిల్లాకు గంజాయిని తరలించి విక్రయాలు చేపడుతున్నారు. ఆంధ్రాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల పోలీసుల అరెస్టు చేసిన వారిలో మహిళ కూడా ఉండడం గంజాయి వ్యాపారం ఈ మేరకు వ్యాపించిందో అర్థం చేసుకోవాలి.

గంజాయి అమ్మకాలు, కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం- డీఎస్పీ రాజశేఖర్ రాజు

ఎవరైనా గంజాయి అమ్మకాలు కానీ కొనుగోలు గాని చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. గంజాయి విక్రయిస్తున్నట్లు ఎవరికి తెలిసినా పోలీసులకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలి అప్పుడే గంజాయి నివారణ పూర్తిస్థాయిలో అరికట్టగలం.

Next Story

Most Viewed