Munugodu MLA: అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకపోతే వాలంటరీగా వెళ్ళిపొండి

by Kalyani |
Munugodu MLA: అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకపోతే  వాలంటరీగా వెళ్ళిపొండి
X

దిశ, మునుగోడు: ప్రతి అధికారి తమ విధులను బాధ్యతాయుతంగా పనిచేయాలని, పనిచేయకపోతే వాలంటరీగా వెళ్లిపొండని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల, ప్రత్యేక అధికారులతో గ్రామాలలో పారిశుద్ధ్య సమస్యల పైన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఎటు చూసినా చెత్తతో నిండి ఉంటుందని, మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై విష జ్వరాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, గ్రామాలని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ అధికారుల మీద ఉందని గుర్తు చేశారు. గ్రామాల్లో మొదట పారిశుద్ధ్య పనుల పైన దృష్టి పెట్టాలని కోరారు. రేపటి నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతామో గ్రామాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైన ఉందన్నారు. గ్రామంలోని నివాస గృహాల మధ్యలో చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ చెత్త వేసినట్లయితే వాటిని వెంటనే తొలగించి గ్రామాల్లో ఆరోగ్య వాతావరణాన్ని సృష్టించాలన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ పనులపై మరో 10 రోజులలో మరొక సమావేశం నిర్వహించి పంచాయతీ కార్యదర్శుల పనితీరును పరిశీలిస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తానని, బాధ్యతాయుతంగా పనిచేసే కార్యదర్శులకు తమ వంతుగా సహకరిస్తానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం ఆరోగ్య నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, మునుగోడు ప్రత్యేక అధికారి మురళి, మునుగోడు ఎంపీడీవో పూజ, గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed