సమస్యల వలయంలో గుగులోతు తండా..

by Sumithra |
సమస్యల వలయంలో గుగులోతు తండా..
X

దిశ, నూతనకల్ : మండల పరిధిలోని మాచనపల్లి ఆవాస గ్రామం గుగులోతు తండా సమస్యల వలయంలో చిక్కుకుంది. సుమారు నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు, గ్రామ పంచాయతీ బోరు నీళ్లు రాకపోవడంతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తండావాసులు తెలిపారు. తండాలో 150 కుటుంబాలలో 400 పై చిలుకు ఓటర్లు ఉన్న తండాలో ఓకే ఒక హ్యాండ్ పంపు ఉండడంతో నీటి కోసం ఒక పూట సమయాన్ని కేటాయిస్తున్నామని అన్నారు. తాగునీరు తెచ్చుకోవడానికి తండా పరిసర ప్రాంతంలోని వ్యవసాయ బావుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుందని మహిళలు వాపోయారు. తండాలో ఉన్న ఏకైక పంపు నుంచి వచ్చే నీటితో బురదమయం అయ్యి జ్వరాల పాలవుతున్నామని తెలిపారు. తండాలో మురుగు కాలువలు లేక, వీధుల వెంట చెత్త తీయకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నామని, ప్రజలు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యతో పాటు పలు సమస్యలను తీర్చాలని కోరారు.

ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి వివరణ..

ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను వివరణ కోరగా గత 15 రోజుల నుండి నీళ్లు రాకపోవడం అనేది వాస్తవమేనని, మిషన్ భగీరథ పైపులైను పగలడంతో సమస్య ఏర్పడిందని, దాంతో పాటు స్థానికంగా ఉన్న బోరు మోటర్ కాలిపోవడంతో మరింత సమస్య ఏర్పడిందని, కొంత వరకు ప్రభుత్వ ట్యాంకర్ ద్వారా నీళ్లు అందిస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో పూర్తి సమస్య తీరుస్తామని తెలిపారు.

Next Story