- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్యం పేరిట అడ్డగోలు వసూళ్లు

దిశ, మేడ్చల్ బ్యూరో : అనుమతి లేకుండా ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు తెగిస్తున్నాయి. ఒక ఆసుపత్రికి అనుమతి తీసుకొని రెండు, మూడు బ్రాంచ్ లు తెరుస్తున్నారు. ఇలా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో వందల సంఖ్యలో క్లీనిక్ లు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. కొందరు మెడికల్ షాపులకు కన్సల్టెంట్ క్లీనిక్ పేరిట ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అవసరం లేకున్నా రకరకాల వైద్య పరీక్షలు చేస్తూ రోగుల జేబులను గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అనుమతి లేకుండానే వైద్యం..
జిల్లాలో 2827 ప్రైవేటు ఆసుపత్రులు, 706 అల్ట్రాసౌండ్ కేంద్రాలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా అనుమతులు లేనివి మరో వెయ్యికిపైగా ఆసుపత్రులు, వందల సంఖ్యలో డయాగ్నస్టిక్ సెంటర్లు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు వచ్చాకే ఆసుపత్రులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు దరఖాస్తు కూడా చేయకముందే రాజకీయ అండదండలతో దర్జాగా ఆసుపత్రులను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు.
కొందరు ప్రైవేటు యాజమాన్యాలు దరఖాస్తులు సమర్పించినా స్పష్టమైన ఆదేశాలు రాకముందే చికిత్స మొదలు పెడుతున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన తనిఖీల్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ప్రభుత్వ వైద్యులు నిర్దేశించిన పని వేళల్లో సర్కారీ దవాఖానల్లో సేవలందించాలి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా బినామీ పేర్లతో సొంత ఆసుపత్రులకు దరఖాస్తు చేసుకొని అక్కడ చికిత్స చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు ఇలా..
కొత్తగా ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా వైద్యఆరోగ్య శాఖ నుంచి అనుమతులు పొందాలి. అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, క్లీనిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, కన్సల్టెంట్ క్లినిక్ లు, ఆయుష్ క్లినిక్ లు, ఫిజియోథెరఫీ కేంద్రాలు అన్నింటికీ అనుమతులు తప్పని సరి. వైద్యశాఖ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ధరల పట్టికల బోర్డులు, స్కానింగ్, ఇమేజింగ్, ల్యాబ్, ఫైర్ సేప్టీ, పొలుష్యన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, బయో మెడికల్ వేస్ట్ మెనేజ్ మెంట్ సర్టిఫికెట్, అర్హులైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
రికార్డులు సరిగ్గా నిర్వహించేలా కంప్యూటర్ వ్యవస్థ, రోగికి సంబంధించిన కేస్ షీట్స్ లను ఐదేళ్ల వరకు భద్ర పరిచే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్కానింగ్ సెంటర్లు తప్పకుండా ఫామ్-ఎఫ్ లను ఆన్ లైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను పాటించని ఆసుపత్రులపై డీఎంహెచ్ ఓ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
అనుమతులు లేకుంటే కఠిన చర్యలు : డాక్టర్ ఉమా గౌరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
అనుమతులు లేకుండా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటికే అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేశాం. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలను ఉల్లంఘించి ఆసుపత్రిని నడిపితే భారీ మొత్తంలో జారిమానా పాటు కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.