- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాన్ పరాక్‌కి అమితా బచ్చన్ లాంటి సినీ దిగ్గజాల ప్రచారమా? సీపీఐ నారాయణ ఫైర్

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ (Modi) పడగ నీడన న్యాయ వ్యవస్థ ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ (CPI Narayana) ఆరోపించారు. డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ అవినీతి ఉదంతం దేశ న్యాయ వ్యవస్థకే కళంకంగా మారిందని ఆయన విమర్శించారు. ఢిల్లీ న్యాయమూర్తి అవినీతికి పరాకాష్టగా అతని ఇంటిలో వంద కోట్ల కరెన్సీ బయటపడడంతో ప్రపంచం నివ్వెర పోయిందన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ వర్మ చేస్తున్నది వ్యాపారం కాకపోయినా వందల కోట్ల రూపాయలు ఇంట్లో ఉందంటే అదంతా అవినీతి సొమ్మేనని ఆరోపించారు. వ్యవహారం బయటకు వచ్చిన నాలుగు రోజుల అనంతరం ఢిల్లీ ఫైర్ డిపార్టుమెంటు అధికారులను మేనేజి చేసి అక్కడ కాలిన నోట్లు ఏమీ దొరకలేదని చెప్పిస్తున్నారని అన్నారు. కాలిన నోట్ల కట్టలు బయట పడినా తప్పుడు రిపోర్టులు ఇచ్చిన ఫైర్ డిపార్టు మెంటు అధికారులనే ఫైర్ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మోడీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రను కోల్పోతున్నదని ఆరోపించారు.(central government) కేంద్ర ప్రభుత్వపు ఒత్తిడి న్యాయవ్యవస్థపై తీవ్రంగా పెరుగుతోందని ఆరోపించారు. ఆఖరుకు కొలీజియం కూడా మోడీ కనుసన్నల్లోకి వెళ్లినట్టు తెలుస్తోందని చెప్పారు. న్యాయవ్యవస్థతో పాటు ఆర్‌బీఐ, సీబీఐ, ఈసీ వంటి అన్నింటినీ నిర్వీర్యం చేసినట్టు తెలిపారు. అనేక కేసుల్లో ముద్దాయి అయిన జగన్ వంటి వారు బెయిల్‌పైనే ఇంత కాలం ఎలా బయట ఉంటున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులపై చర్యలకు అవకాశం తక్కువే ఉందని, కాబట్టి ఆవసరమైతే చట్టాలను మార్పు చేసి తప్పు చేసే న్యాయమూర్తులపై కఠినంగానే వ్యవహరించాలని డిమాండు చేశారు. ప్రస్తుతం అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిన వర్మను అలహాబాదు హైకోర్టు కూడా తమకు వద్దు అంటోందని, ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం ముందు పెద్ద కుర్చీ వేసి పని ఇవ్వకుండానే ఖాళీగా కూర్చోబెట్టాలని, ఇదే సరైన శిక్ష అంటూ చురకలంటించారు.
ఇక మోడీ ప్రభుత్వం రాజ్యాంగం అందించిన ఫెడరల్ ( సమాఖ్య ) స్పూర్తిని తీవ్రంగా దెబ్బ కొడుతోందని, ఇందులో భాగంగానే డీలిమిటేషన్‌ను ముందుకు తెచ్చిందని ఆరోపించారు. ఇది దేశాన్ని దక్షిణాది, ఉత్తరాధి అని రెండుగా విభజిస్తోందన్నారు. గతంలో ఇందిరా గాంధీ ఫెడరల్ స్పూర్తికి భిన్నంగా పాలన సాగిస్తుంటే ఎన్‌టీఆర్ దాన్ని అడ్డుకోవడం కోసం ఉద్యమించారని, దానికి వామపక్షాలు సహా ఇతర శక్తులు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు.
డబ్బుల కోసం సమాజానికి హాని చేసే గుట్కా, పాన్ పరాక్ తదితర ప్రకటనల్లో నటిస్తున్న సినిమా హీరోల తీరు దారుణమని నారాయణ పేర్కొన్నారు. అమితాబ్, షారుక్ మొదలు తెలుగు నటులు కూడా అనేక మంది ఆ తరహా ప్రకటనల్లో నటించడాన్ని ఆక్షేపించారు. మంచి సంపాదన ఉన్నా డబ్బుల కోసం ఇటువంటి చవకబారు ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదన్నారు. పాన్ మసాలాలు, గుట్కాలు కూడా ఆహార పదార్థాలే అనే ఒక తీర్పు ఆధారంగా ఆ కంపెనీల ప్రకటనల్లో నటించడం దారుణమని పేర్కొన్నారు. పాన్ మసాలాతో పాటు ఇచ్చే మరో చిన్న ప్యాకెట్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతోందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే ప్రకటనల్లో నటించి వచ్చే వందల కోట్ల సంపదను పోయినాకా కాష్టంపై వేసుకొని తగల బెట్టించుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుల కోసం కక్కుర్తి పడి కళామ తల్లిని అపహాస్యం చేయవద్దని హితవు పలికారు.