నిరుపయోగంగా చేపల మార్కెట్ భవనాలు

by Mahesh |
నిరుపయోగంగా చేపల మార్కెట్ భవనాలు
X

దిశ, కొండమల్లేపల్లి: ప్రభుత్వలు ఎంతో ప్రతిష్టాత్మక నిర్మించిన చేపల మార్కెట్ వినియోగంలో లేదు. ఆ భవనాలను ఉపయోగించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తుంది. చేపల మార్కెట్ కోసం నిర్మాణం చేసిన భవనాలు పూర్తిగా వినియోగంలోకి రాకుండా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని విమర్శలున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్ చేతుల మీదుగా కొండమల్లేపల్లి లో లక్షల రూపాయల నిధులతో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన భవనాన్ని నిరుపయోగంగా ఉండడంతో స్థానిక ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే ..

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలోని సంత సమీపంలో రూ. 50 లక్షల నిధులతో 2023 అక్టోబర్ 4వ తేదీన నాటి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన చేపల మార్కెట్ భవనాన్ని సంవత్సర కాలంగా వినియోగం లేకుండా చేశారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం గతంలో చేపల మార్కెట్ నిర్మించగా అప్పటి ఎమ్మెల్యే ఈ భవనాలను ప్రారంభించారు. జాతీయ ముత్య అభివృద్ధి సంస్థకు చెందిన లక్షల రూపాయల నిధులతో భవనాలు నిర్మించారు. అధికారులు నిబంధన ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడంతో అధికారులు ఎవరిని పట్టించుకోవడం లేదు దీంతో లక్షల రూపాయలతో నిర్మించిన ఫిష్ మార్కెట్లను వృధాగా మార్చేశారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు అధికారులు వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా విపలమయ్యారు. దీంతో దుకాణాలు కేటాయింపు లేకపోవడంతో ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా వినియోగం లేకపోవడంతో పిచ్చి మొక్కలు ఆవరణలో మొలచి అద్వానంగా తయారయ్యాయి.

రోడ్డు వెంబడి చేపల విక్రయాలు.. తరచు ప్రమాదాలు..

మరోపక్క చాపల విక్రయం ఊపు అందుకోవడంతో జాతీయ రహదారిపై పుట్టగొడుగుల చేపల షాప్‌లు వెలిసాయి. రహదారి వెంబడి ఇలా విక్రయాలు చేయడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారిపోయింది. రోడ్డు వెంబడి చేపలు కట్ చేసిన తర్వాత చెత్త పడి వేయడంతో గత కొంతకాలంగా పందుల పెరిగిపోయాయి. ఈ పందులు రోడ్డుకు అడ్డు రావడంతో వాటిని ఢీకొట్టి ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ చేపల దుకాణాల వల్ల కుక్కలు సైతం రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ఎన్నో ప్రమాదాలు జరిగి ఎందరో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని జాతీయ రహదారుల వెంట ఉన్న చాపల విక్రయ దుకాణాలను తీసివేసి నిరుపయోగంగా ఉన్న చేపల మార్కెట్లో మార్కెట్ జరిగేందుకు చొరవ చూపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story