కేసీఆర్ పెట్టేవి స్కీంలు కావు స్కాంలు : R. S. Praveen Kumar

by samatah |   ( Updated:2022-09-25 12:28:50.0  )
కేసీఆర్ పెట్టేవి స్కీంలు కావు స్కాంలు : R. S. Praveen Kumar
X

దిశ, చౌటుప్పల్: తెలంగాణ ముఖ్యమంత్రి తెచ్చేవి స్కీంలు కాదు స్కాంలని డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఆ స్కీంల ద్వారా టీఆర్ఎస్ నాయకులు పేదల పేరు చెప్పి జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చీరలు అడగలేదన్నారు. కానీ ఓట్ల కోసం నాసిరకం చీరలు పంచి, మహిళలను అవమానపరుస్తున్నారన్నారు. అదే డబ్బుతో ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు ఎందుకు యూనిఫాం ఇవ్వడం లేదని నిలదీశారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా ఆదివారం 122 వరోజు చౌటుప్పల్ మండల కేంద్రంలో కొనసాగింది.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక పక్క కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాం చేసుకుంటూ, మరోపక్క బతుకమ్మ ఆడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్ళ పాలనలో కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం,మిషన్ భగీరథ వంటి స్కీంల ద్వారా కోట్లు సంపాదించారని ఆరోపించారు. మరోపక్క మోడీ దేశం మొత్తాన్ని గుజరాత్ రాష్ట్రంలోని సేట్లకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. నిత్యావసర ధరలు పెంచి పేదల సొమ్ము దోచుకుంటున్నారని తెలిపారు. మునుగోడు ఎన్నికల కోసం అమిత్ షా 150 కోట్లు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారని, అవన్ని ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. బహుజనులను మోసం చేసిన అమిత్ షా ప్రతిభావంతులను వదిలేసి, క్రికెట్ ఆట రాకపోయినా అతని కొడుకును సీసీఐ సెక్రటరీగా ఎలా నియమించారని,అక్కడ ఉన్న కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు.

లైట్ వెహికిల్ డ్రైవర్స్, హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చౌటుప్పల్ సెంటర్ లోని చాకలి ఐలమ్మ,సర్వాయిపాపన్న గౌడ్,అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. బహుజనరాజ్యంలో డ్రైవర్ వృత్తి చేసే వారిని ఆదుకుంటామని మాటిచ్చారు. ఆటో డ్రైవర్లను, వీధివ్యాపారులను కలిసి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి ప్రశాంత తెలంగాణలో మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న బీజేపీ పార్టీలో చేరారని,మునుగోడు ప్రజలంతా గమనించాలన్నారు.

సర్పంచ్ లను, ఎంపీటీసీలు,జెడ్పీటీసీ లను కొంటున్న రాజగోపాల్ రెడ్డిని నమ్మకూడదన్నారు. ఇంతకాలం పాలించిన ఆయన కనీసం ప్రజలకు మూత్రశాలలు కట్టించలేదని, ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణ చేశారని, స్థానిక యువతకు ఉద్యోగాలు ఇప్పించలేకపోయారని, అందుకే పేదల రాజ్యం రావాలన్నారు. అందుకు ఏనుగు గుర్తుకే ఓటేసి బీఎస్పీనీ గెలిపించాలని కోరారు. బహుజన రాజ్యంలో పిల్లలు విదేశాల్లో చదవచ్చని,ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి వస్తుందని, భూములకు పట్టాలిస్తామని, ప్రతి వ్యక్తి వందేళ్ళు బతికేలా చూస్తామని హామీ ఇచ్చారు. తంగడపల్లి గ్రామంలోని వడ్డెర సామాజికవర్గానికి చెందిన మహిళలను కలిశారు. వారి పిల్లలు పాఠశాలకు వెళ్తే వివక్ష చూపుతున్నారని ఇది దుర్మార్గమైన చర్య అని ఖండించారు. ఇలాంటి అవమానం పోవాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. ఈ యాత్ర లక్కారం,హనుమాన్ కాలనీ,పద్మశాలికాలని,తంగడిపల్లి గ్రామాల్లో జరిగింది.అనంతరం యాత్ర దామెర మరియు నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం,చిమిర్యాల,కొతులపురం మీదుగా సర్వేల్ వరకు కొనసాగనుంది.

Advertisement

Next Story