పరిమితికి మించి వైద్యం.. ఆర్ఎంపీ, పీఎంపీల ఇష్టారాజ్యం

by Nagam Mallesh |
పరిమితికి మించి వైద్యం.. ఆర్ఎంపీ, పీఎంపీల ఇష్టారాజ్యం
X

దిశ, గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో వైద్యం వ్యాపారంగా మారింది. ఎక్కడ చూసినా కమీషన్లు, పంపకాల మాటలే వినిపిస్తున్నాయి. గత 15రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్యం పేరుతో ఆర్ఎంపీ, పీఎంపీ లు అందినకాడికి దండుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం లేని కొంతమంది ప్రజలు ప్రయివేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తుండడంతో వైద్య వ్యాపారానికి ఢోకా లేకుండా పోయింది.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్ఏంపీ, పీఎంపీలు

వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులతో పాటు, దోమల వల్ల సంక్రమించే డెంగ్యూ, మలేరియా వ్యాధుల వ్యాప్తి పెరిగి పల్లెలు మంచం పడుతున్నాయి. ఇదే అదనుగా భావించి కొత్త కొత్త వైద్యం నేర్చుకున్న కొందరు ఆర్ఎంపీ, పిఎంపీ లు సైతం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వైద్యాధికారులు కమీషన్లు తీసుకుని అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో సైతం వందల సంఖ్యలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఉన్నారు.

ప్రాథమిక చికిత్స అందించాల్సిన ఆర్ఎంపీ, పిఎంపి వైద్యులే ఇంజక్షన్లు, గ్లూకోజ్, యాంటీబయాటిక్స్ ఇస్తూ డబ్బులు రోగాల బారిన పడిన ప్రజల నుంచి ఇష్టారీతిన డబ్బులు దండుకుంటున్నారు. రెండు, మూడు రోజుల తర్వాత కూడా వ్యాధి నయం కానీ పక్షంలో రోగిని ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తుండటంతో అసలు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పేషెంట్‌ను రిఫర్ చేసే సమయంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ఫీజులో 50 శాతం కమీషన్ ఇస్తాయనేది బహిరంగ రహస్యమే. తాము చెప్పిన ఆసుపత్రికి కాకుండా మరో ఆసుపత్రికి వెళితే స్థానికంగా వైద్యం అందించమని ఆర్‌ఎంపీ, పీఎంపీ బెదిరించడమే కాకుండా వ్యాధి బారిన పడిన ఆయా రోగులకు చికిత్స అందించడానికి నిరాకరిస్తుండడం గమనార్హం.

ఎలాంటి అనుమతులు లేకున్నా మెడికల్ షాప్ లు నిర్వహిస్తున్న వైనం

గ్రామాల్లోకి ఎలాంటి అధికారుల పర్యవేక్షణ ఉండదని, ఒకవేళ ఉన్నా తమని ఎవరూ ఏమనరనే ఆలోచనలతో తమకు ఎలాంటి అనుమతులు లేకున్నా మెడికల్ షాప్ లు సైతం నిర్వహిస్తూ తమ దగ్గరకు వైద్యం కోసం వస్తున్న ప్రజలకు వాటిని అందించి వారి నుంచి ఇష్టారీతిన డబ్బులు తీసుకుంటున్నారు.

Next Story

Most Viewed