కొనసాగుతున్న రోడ్డు పనులు.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపం

by Hamsa |
కొనసాగుతున్న రోడ్డు పనులు.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపం
X

దిశ, వేములపల్లి: సూర్యాపేట నుంచి వేములపల్లి మండలం శెట్టి పాలెం సమీపంలోని అద్దంకి నుంచి నార్కట్ పల్లి రహదారి వరకు 28 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి 8 సంవత్సరాల క్రితం నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు జిల్లాలతో పాటు మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు తక్కువ సమయంలో ప్రయాణించడానికి వీలుంటుంది. ఈ మార్గం ద్వారా మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులకు శాపంగా మారింది.

28 కి.మీటర్ల రోడ్డు నిర్మాణానికి..

వేములపల్లి మండలం శెట్టిపాలెం నుంచి సూర్యాపేట వరకు రహదారి విస్తరణ పనుల కోసం 2015లో నిధులు మంజూరయ్యాయి. 2016 సంవత్సరంలో రోడ్డు పనులను ప్రారంభించారు. సుమారు 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టడానికి మొదటి విడతగా రూ.24 కోట్లు, రెండవ విడతలో మరో రూ.20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిర్మాణం చేపట్టడానికి కేఎంఆర్ గ్రూప్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కాగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు కూడా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పూర్తికాని కల్వర్టులు భీమవరం-సూర్యాపేట రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన కల్వర్టుల ఆధునీకరణ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. నిర్మాణంలో 9 బాక్స్ కల్వర్టులు ఉండగా, గూణల ద్వారా నిర్మించాల్సిన కల్వర్టులు 50కి పైగా ఉన్నాయి. బాక్సు బ్రిడ్జ్ నిర్మాణాల్లో ఆరు నిర్మాణం పూర్తికాగా మరో మూడు పెండింగ్ లో ఉన్నాయి. పూర్తయిన బ్రిడ్జిల వద్ద కూడా మట్టి పోయకపోవడం వలన ప్రయాణికులు తాత్కాలిక రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తుంది. గుణల నిర్మాణంలో 30 నిర్మాణాలు పూర్తి కాగా మరో 20 పాటు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకచోట రోడ్డు తవ్వి గుంతలు ఏర్పడడంతో ప్రయాణానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

భూసేకరణ ఎప్పటికో..

మండలంలోని శెట్టి పాలెం నుంచి సూర్యాపేట వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణంలో భాగంగా మండలంలోని లక్ష్మీదేవి గూడెం, కేతేపల్లి మండలం భీమవరం వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు మంజూరు కాగా 1.8 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణం చేపట్టాల్సింది ఉంది. బైపాస్ రోడ్డు కోసం 38 మంది రైతుల నుంచి సుమారు 30 ఎకరాల వరకు భూమి సేకరణ చేయాల్సి ఉంది. భూమి సేకరణ కోసం ఒక కోటి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయగా 80 శాతం మంది రైతులకు పేమెంట్ అయిపోయినట్టు అధికారులు పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భూసేకరణ కాకపోవడం వలన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

ఆరు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలలో కంకర మాత్రమే పరిచి బీటీ వేయకపోవడం వల్ల దుమ్ము ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని రాస్తారోకోలు నిర్వహించినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నా పట్టింపు ఏది

మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి మూడు నియోజకవర్గాలను కలుపుతూ వెళ్తుంది. ఈ రోడ్డు అభివృద్ధిలో భాగంగా ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా మంత్రితో పాటు ఒక రాజ్యసభ సభ్యులకు కూడా ఈ రహదారికు సంబంధం ఉన్నప్పటికీ ఎనిమిది సంవత్సరాలైనా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం, మొల్కపట్నం, రావులపెంట, లక్ష్మీదేవి గూడెం, ఆమనగల్లు గ్రామాలు ఉండగా, నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలంలోని భీమారం ఉండగా, సూర్యాపేట నియోజకవర్గం లోని వెదురు వారి గూడెం, కుసుమ వారి గూడెం గ్రామాలు ఉన్నాయి. నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ రోడ్డు ఆలస్యంపై ప్రజలు బహిరంగంగానే గుసగుసలాడుతున్నారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి గణేష్ కుమార్ ఆర్ అండ్ బి డి ఈ దాదాపుగా రోడ్డు నిర్మాణం పనులు పూర్తయ్యాయి.. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తి చేశాం. కల్వర్టులతో కలుపుకొని 1300 మీటర్లు రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ వేసవికాలంలో పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు చేపడతాం.

దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు

పాలకూరి సుమన్, మొల్కపట్నం రోడ్డు నిర్మాణం కోసం కంకర పోసి నాలుగు సంవత్సరాలైనా నిర్మాణం చేపట్టకపోవడంతో దుమ్ము వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాహనాలు వచ్చినప్పుడు ఇంట్లోకి దుమ్ము చేరుతుంది. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story