'నుడా తో నల్లగొండ మహర్ధశ.. రోడ్ల విస్తరణకు రూట్ మ్యాప్

by Disha News Web Desk |
నుడా తో నల్లగొండ మహర్ధశ.. రోడ్ల విస్తరణకు రూట్ మ్యాప్
X

దిశ, నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన అంశం తెలిసిందే. అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలను కలుపుతూ నుడా (నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్) గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లు ఒకరి వెంట మరొకరు వరుసగా నల్లగొండలో పర్యటించి అభివృద్ధి నమూనాలు రూపొందించిన విషయం తెలిసిందే.

అందుకు కొనసాగింపుగా బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఎల్సీ ఎంసీ కోటిరెడ్డి తో పాటు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు, రవీంద్ర నాయక్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

నుడా ఏర్పాటుతో త్వరితగతిన నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి అనే అంశాలపై మున్సిపల్ కమిషనర్ రమణాచారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు. మాస్టర్ ప్లాన్ లోకి ఎంపిక చేసిన 25 గ్రామాలను, విస్తీర్ణతను ప్లాన్ ఏ, బీ, సీ లుగా వర్గీకరించి చూపించారు. రోడ్ల విస్తరణకు రూపొందించిన రూట్ మ్యాప్ తో పాటు పట్టణంలో రోడ్ల విస్తరణ అనంతరం జరిగే అభివృద్ధిని వివరించారు.



ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో పాటు కళాభారతి స్టేడియం, అర్బన్ పార్కులు, వెండర్ జోన్స్, శిల్పారామాల ఏర్పాటుపై మంత్రి జగదీష్ రెడ్డి లోతైన విశ్లేషణ నిర్వహించారు. అధికారులు, ఏజెన్సీలు రూపొందించిన ప్లాన్ ఏ, బీ, సీ లను సమగ్రంగా అధ్యయనం చేసిన మీదట కొన్ని సవరిస్తూ ప్లాన్ డి రూపొందించాలని మంత్రి జగదీష్ రెడ్డి పలు సూచనలు చేశారు. అంతే కాకుండా పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా జరుగుతున్న అభివృద్ధి ఉండాలనేది ప్రభుత్వ సంకల్పమని అధికారులు రూపొందించే ప్రణాళికలు, ఆ సంకల్పానికి అనుకూలంగా ఉండాలని మంత్రి సూచించారు.

నుడా ఏర్పాటుతో ఇకపై పది ఎకరాల వరకు ఏర్పాటు చేసే వెంచర్లకు అనుమతులు నుడా పరిధిలోనే ఉంటాయని అధికారులు వివరించారు. అదే విధంగా గ్రామాలు నుడా లో కలిసినప్పటికీ ఇండ్ల నిర్మాణం అనుమతులు మాత్రం గ్రామ పంచాయతీలకు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. సుమారు రెండున్నర గంటల పైగా జరిగిన సమీక్షా సమావేశంలో నుడా ఏర్పాటు, అందులో కలవనున్న గ్రామాలు, భవిష్యత్ లో ఏర్పాటు చేయనున్న నిర్మాణాలు రోడ్ల విస్తరణ, మొత్తంగా నల్లగొండ సుందరీకరణకు తీసుకోబోతున్న చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed