KCR వేసిన రోడ్లపై నడవొద్దు: BRS ఎమ్మెల్యే భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-02-07 11:14:55.0  )
KCR వేసిన రోడ్లపై నడవొద్దు: BRS ఎమ్మెల్యే భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నల్గొండ ప్రతినిధి: ఇతర పార్టీ వాళ్లు సీఎం కేసీఆర్ వేసిన రోడ్లపై నడవద్దు.. సంక్షేమ పథకాలు తీసుకోవద్దంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నర్సాపురం గ్రామస్తులను హెచ్చరిస్తున్న వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నియోజకవర్గ పరిధి దామరచర్ల మండలం నర్సాపురం గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి చేసిన వాళ్లకు.. అన్నం పెట్టే వాళ్లకు సున్నం పెడతారా అంటూ గ్రామస్తులను నీలదీశారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, అన్నం పెట్టే వారికి సున్నం పెట్టే వారి సంగతి కళ్లెపల్లి మైసమ్మ తల్లే చూసుకుంటుందన్నారు.

మమ్మల్ని వ్యతిరేకించే వారు కేసీఆర్ వేసిన రోడ్లపై నడవొద్దని, సంక్షేమ పథకాలు తీసుకోవద్దన్నారు. మాయమాటలు చెప్పే నాయకులు 20మందికి కూడా పింఛన్లు మంజూరు చేయించలేరన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. నర్సాపురం గ్రామంతో తనకు ఏదో అయిపోద్దని భావిస్తున్నారని, నా సంగతి మీకు తెలియదు నేను మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటానని.. డాన్స్‌లు చేసే వారి చేత ఎలా డాన్సులు చేయించాలో కూడా తనకు తెలుసునంటూ గ్రామస్తులను హెచ్చరించే విషయం నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story