దిశ ఎఫెక్ట్.. కుర్చీలో ప్రసవానికి కారణం వారే..పలువురికి షోకాజ్ నోటీసులు

by Aamani |
దిశ ఎఫెక్ట్.. కుర్చీలో ప్రసవానికి కారణం వారే..పలువురికి షోకాజ్ నోటీసులు
X

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలో ప్రసవం కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి నల్గొండ ప్రధాన ఆసుపత్రిలో కుర్చీలో ప్రసవం జరిగినట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి రాగానే ఆసుపత్రి డాక్టర్లను అప్రమత్తం చేశామని జేసీ పూర్ణ చంద్ర తెలిపారు. ప్రస్తుతం తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ,క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నెరేడుగొమ్ము మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని గురువారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి వెళ్లిన సందర్భంలో అక్కడ డాక్టర్ లేనందున డ్యూటీలో ఉన్న నర్సులు అంబులెన్స్ ను ఏర్పాటు చేసి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు తెలిసిందని వెల్లడించారు.గర్భిణీ అశ్విని అంబులెన్స్ లో తన కుటుంబ సభ్యులతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి రాత్రి సుమారు 12:30 గంటలకు వచ్చిందని, ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ నిఖిత, డ్యూటీలో ఉన్న నర్సులు అశ్వినిని పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని గుర్తించడం , అంతేకాక నొప్పులు ఆగి ఆగి వస్తుండడాన్ని గమనించి లేబర్ రూమ్ కి తీసుకెళ్లి డ్రెస్ మార్చుకోమని చెప్పారని, 30 నిమిషాల తర్వాత రెండోసారి బీపీ పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉన్నందున వైద్య నిబంధనల ప్రకారం నడవమని చెప్పారని తెలిపారు.

రాత్రి సుమారు రెండు గంటల సమయంలో అశ్విని మళ్ళీ నడుస్తున్న క్రమంలో లేబర్ రూమ్ ముందు నొప్పి రావడంతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోగా వెంటనే ప్రసవం అయి బిడ్డ బయటకు వచ్చేసిందని, అక్కడే ఉన్న అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకుని వెంటనే డాక్టర్ను పిలువగా నర్సులు వచ్చి వైద్య సేవలు అందించారని ,బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు .అయితే ఇలాంటి సందర్భాల్లో అనుభవం ఉన్న వారి సహాయం లేకుండా నడవమని సలహా ఇచ్చిన నర్సు లేదా ఇతరుల ప్రోత్సాహంతో నే ఇలాంటి సంఘటన జరిగినట్లు గుర్తించామని, దీనికి బాధ్యులైన డ్యూటీ డాక్టర్ నిఖిత, స్టాప్ నర్సులు ప్రమీల, ఉమ, పద్మ ,సుజాతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై వారి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు.

రాత్రి డ్యూటీ లో ఉండాల్సిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ శాంతి స్వరూప డ్యూటీలో ఉండకపోగా, అందుబాటులో లేకపోవడం,ఈ విషయమై నర్సులు మాట్లాడగా అనస్తేషియా డాక్టర్ లేనందువల్ల గర్భిణీని ప్రసవం కోసం నల్గొండకు పంపించినట్లు తెలిపారని,ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్ శాంతి స్వరూప తో పాటు, విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి ,సైదమ్మ,మౌనిక, సరిత లను సస్పెండ్ చేయాలని డీసీ హెచ్ ఎస్ ను ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాను ప్రాథమిక నివేదికను సమర్పించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ తో పాటు, నలుగురు నర్సులపై చర్యలకు ఆదేశాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.సాధారణ,సిజేరియన్ అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అయితే డాక్టర్లు, అనెస్థీషియా ఇతర సర్జన్ ల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

జిల్లాలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రులతో 24 గంటలు సేవలందించేలా చూస్తున్నామన్నారు. ఇటీవల ట్రాన్స్ఫర్ సందర్భంగా ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జిల్లా ఆసుపత్రి నుండి బదిలీ కాగా, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా తిరిగి భర్తీ చేసుకుంటున్నామని తెలిపారు.సంఘటన జరిగిన రోజు రాత్రి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మొత్తం (9) ప్రసవాలు జరిగాయని,నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోజువారీ ఆరోగ్య సేవల పరిస్థితి పై ఒక కన్నేసి ఉంచడం జరిగిందని,వైద్య సేవల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.దిశ మా బాధ ను ప్రచురితం చేసింది కాబట్టే మాకు న్యాయం జరిగింది అని అశ్విని భర్త ఆంజనేయులు తెలిపారు.ప్రతి పేద వారికి సరిఅయిన వైద్యం అందాలని కోరారు.

Advertisement

Next Story