- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరవళ్లు తొక్కే కృష్ణమ్మపై ప్రయాణం.. సాగర్ టు శ్రీశైలం
దిశ, నాగార్జునసాగర్ : అందాల అల నల్లమల.. ఆ పేరు వింటేనే అభయారణ్యం తో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. అలల సవ్వడులు.. కొండల అంద చందాలు.. పచ్చిక బయళ్ళ కనువిందు.. పెట్టని గోడల రాతి వరుసలు.. తీరం వెంబడి జీవరాశులు.ఆ ప్రాంతమే నేడు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దు కాబోతుంది. పోటీ ప్రపంచంతో కుస్తీ పట్టి విసిగిపోయి.. అలసిపోయిన పట్టణ జనం సెలవుదినాల్లో ఈ ప్రాంతంలో గడపడానికి అత్యంత మక్కువ చూపుతున్నారు. ఇక్కడ జలజల పారే సెలయేళ్ళు.. పక్షుల కిలకిల రాగాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు.. నాటి శిల్పకళను తెలియజేసే ఎంతో సుందరమైన కట్టడాలు ఆధ్యాత్మికతను నింపుతాయి. కనుచూపు మేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్లుగా కనిపించే అరుదైన వృక్షాలు ఆహ్లాద పరుస్తాయి. నల్లమల్ల ఒకవైపు బిరా బిరా కృష్ణమ్మ పరుగులు… మరోవైపు దట్టమైన అడవితల్లి అందాలు..
నల్లమల అటవీ ప్రాంతం, కొండకోనల మధ్య కృష్ణా నది తీరం
పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జునసాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం ఆరు గంటల మేర ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని మిగిల్చే పర్యాటకుకు ఎటు చూసినా పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీ జలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులు. నిశ్శబ్ద ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించడాన్ని ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు కోరుకుంటారు. నాగార్జున నాగర్జున సాగర్ శ్రీశైలం ప్రయాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం.
అలలపై కలల జర్నీ.. కనువిందు చేసే కృష్ణమ్మ అందాలు..
నందికొండ నుంచి శ్రీశైలంకు కొనసాగే ఈ రెండు రోజుల ప్రయాణం తీరం వెంబడి ఉన్న అమ్రాబాద్ నల్లమల్ల అడువుల ప్రకృతి సహజ అందాలు పర్యాటకుల మనస్సులను ఇట్టే కట్టి పడేస్తాయి. కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలి గట్టు నాగార్జునకొండ సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. గౌతమ బుద్దుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు, మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనువిందు చేస్తూనే ఉంటాయి
నల్లగొండ, నాగర్‌కర్నూల్, కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఆదివాసీలు, చెంచులు, గిరిజనులు గుట్టపైనున్న శివుడిని ఆరాధిస్తారు. కుడివైపు, ఆంధ్ర, ఎడమవైపు తెలంగాణ ప్రాంతంలోని నల్లమల కొండలు.. వాటి మధ్యలో కృష్ణమ్మ ఒడిలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కృష్ణా నది మీదుగా మెల్లగా కిందకి దిగుతున్న సూర్యబింబాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. రెండు గుట్టల మధ్య పాతాళ గంగ వద్ద కట్టిన వారధి కింది నుంచి శ్రీశైలం డ్యామ్ ఎదురుగా ఎడమవైపున ఉన్న లింగాల గుట్ట శ్రీశైల మల్లన్న, భ్రమరాంబికా దేవిని దర్శించుకుని శ్రీశైలం ప్రాజెక్టు చూసి తిరుగు ప్రయాణంలో నల్లమల అందాలే కనువిందు చేస్తాయి. మరిచిపోలేని అనుభూతులు మిగులుతాయి
లాంచీ ప్రయాణం.. దూరం
సాగర్ - శ్రీశైలం మధ్య 120 కి.మీ. మేర లాంచీ ప్రయాణం సాగుతుంది. దీనికి సుమారుగా 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో పర్యాటకులు పొందే అనుభూతులు అద్భుతం. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చదనంతో కప్పేసిన నల్లమల అడవులు.. వాటి మధ్య ప్రవహించే కృష్ణమ్మ పరవళ్లను చూడటానికి రెండు కళ్లు చాలవు. దీంతో పాటు పసందైన విందు, నోరూరించే చేపల వంటకాలతో పర్యాటకశాఖ చేసే ఏర్పాట్లు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతోంది. ఈ ప్రయాణంతో పర్యాటకులకు మరవలేని మధుర స్మృతులు మిగులుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పక్షుల కిలకిలారావాలతో.. నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ.. పచ్చటి కొండల చుట్టూ తిరుగుతూ.. ఉత్సాహంగా ఈ జర్నీ సాగుతుంది. సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకు సాగే ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు ఇక్కడ ఓ గైడ్ కూడా ఉంటాడు. అతను ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను పర్యాటకులకు వివరిస్తుంటాడు. ఇక కృష్ణా నదిలో బోటు ప్రయాణం చేసినంత సేపూ మనకేమీ గుర్తుండదు. ఎలాంటి ఆలోచనలు మన దరిచేరవు. అలా ఉంటుంది అక్కడి వాతావరణం.
ఆ మనోహరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు ఆనంద తాండవం చేస్తుంది. కృష్ణానదిలో దాదాపు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంటుంది రెండు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు అహ్లాదం కల్గిస్తుంది. కృష్ణమ్మ అలల సవ్వడులతో సాగిన లాంచీ ప్రయాణంలో నదీ తీరం వెంట అమ్రాబాద్ నల్లమల అడవుల ప్రకృతి సహజ అందాలు, తీరం వెంట మత్స్యకారుల జీవన శైలి, చాకలి గట్టు, నదీతీరంలో దాహం తీర్చుకోవడానికి వచ్చే జింకలు, దుప్పులు కనువిందు చేశాయని పర్యాటకులు తెలిపారు. గౌతమ బుద్ధుడు చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంలో ప్రయాణం, ఏలేశ్వర గట్టు దర్శనం, చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు మధురానుభూతులను మిగిల్చాయని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి శనివారం లాంచీ ప్రయాణం
ప్రతి వారంలో శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జునసాగర్‌కు చేరుకుంటుంది. ఈ రెండు రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు.
సాగర్ -శ్రీశైలం లాంచీ ప్రయాణం - ప్యాకేజీ వివరాలు
ఈ లాంచీ ప్రయాణం కోసం పెద్దలకు రూ.2 వేలు గా నిర్ణయించారు. పిల్లలకు రూ.1,600గా ఉంది. ఇది సింగిల్ వేకు మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ పర్యాటక శాఖ తెలిపింది. రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2400 గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే…. సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో రావొచ్చు. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా 9848540371 లేదా 9848306435 నెంబర్లను సంప్రదించాలి.