ఆర్ఎస్పీ ఎదురీత! సవాల్‌గా మారిన నాగర్‌కర్నూల్ గెలుపు

by Ramesh N |   ( Updated:2024-05-05 14:45:42.0  )
ఆర్ఎస్పీ ఎదురీత! సవాల్‌గా మారిన నాగర్‌కర్నూల్ గెలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పార్లమెంట్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన ఆయన నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో గత స్వేరోస్, బహుజనవాదులు, గత కేడర్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తోంది. బహుజన వాదం వదిలేశారనే చర్చ జరగడంతో ఆర్ఎస్పీకి నెగిటివ్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాలన్న.. పార్టీలో చేరడం ఏమిటని పలువురు మేధావులు సైతం ఆయనను ప్రశ్నించారు. బీఎస్పీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను తీవ్రస్థాయిలో విమర్శించి.. ఆఖరుకు ఆయన పంచనే చేరారనే అంశాన్ని ప్రత్యర్థులు, బీఎస్పీ నాయకులు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ చేస్తున్నారు.

కేసీఆర్ వచ్చినా కనిపించని జోష్

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర కూడా పార్లమెంట్ పరిధిలో పూర్తి చేశారు. అయితే పార్టీ కేడర్‌లో ఎలాంటి కొత్త జోష్ కనిపించడంలేదని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమికి కారణమయ్యారని ఆర్ఎస్పీపై పార్టీ శ్రేణులు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్, బీజేపీ ప్రచారం దూకుడు పెంచాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలు జరుగుతూనే ఉన్నాయి. గులాబీ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను హస్తం, కమలం పార్టీ నేతలు లాగేస్తున్నారు. ముఖ్యంగా 2019లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోతుగంటి రాములు బీజేపీలో చేరడంతో ఆయన కుమారుడు భరత్‌ ప్రసాద్‌ను ఈ స్థానం నుంచి క్యాండిడేట్‌గా బీజేపీ ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్‌ కేడర్ కన్ఫ్యూజన్‌లో పడింది. పోతుగంటి రాములు, భరత్‌తో కేడర్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇది ఆర్ఎస్పీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్‌తో కీలక నేతలు ఆకర్షిస్తోంది.

పలు సర్వేల్లోనూ వెనుకంజ

పలు సర్వేల్లో సైతం ఆర్ఎస్పీ వెనకంజలోనే ఉన్నారు. తాజాగా ఆర్‌టీవీ చేసిన సర్వేలో నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుస్తారని తేలింది. జన్ లోక్ పాల్ సర్వేలో సైతం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 40.05 శాతంతో విజయం సాధిస్తారని వెల్లడైంది. బీజేపీ అభ్యర్థి 37.60 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆర్ఎస్పీ 18.20 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. ఇంకా ఎన్నికలకు 8 రోజుల సమయం ఉన్నందున సమీకరణాలు కొంత మారే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Read More...

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే.. KCR సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed