అది ఎప్పటికైనా ప్రమాదమే: మంత్రి మల్లారెడ్డిపై MLA మైనంపల్లి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-12-19 12:38:54.0  )
అది ఎప్పటికైనా ప్రమాదమే: మంత్రి మల్లారెడ్డిపై MLA మైనంపల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీపై మైనంపల్లి హన్మంత్ రావు క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తల భవిష్యత్ కోసమే ఈ సమావేశమైనట్లు తెలిపారు. ప్రతిదానిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్‌లో పదవులు తీసుకున్నవాళ్లే మళ్లీ తీసుకుంటున్నారని.. దీంతో పార్టీ కోసం కష్టపడే కేడర్‌కి తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్యకర్తల భవిష్యత్ గురించి ఆలోచించడానికే ఈ భేటీ నిర్వహించినట్లు తెలిపారు. కష్టపడే కార్యకర్తలకు న్యాయం జరగనప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలని.. అప్పుడే విషయం అధిష్టానం దృష్టికి వెళ్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడకపోతే ఎలా అని మైనంపల్లి ప్రశ్నించారు. మేము వద్దన్న వ్యక్తులకు పదవులు ఇచ్చేస్తున్నారని.. కష్టపడుతోన్న క్యాడర్‌కి అన్యాయం జరుగుతోందన్నారు.

నాయకుడు కేడర్ గురించి మాట్లాడకుంటే డమ్మీ ఎమ్మెల్యే అంటారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్‌ను కలవడానికి ప్రయత్నించామని.. కానీ కుదరలేదని చెప్పారు. కేడర్‌కి అన్యాయం జరుగుతుంటే సమావేశం కావడం తప్పేమి కాదన్నారు. కొందరు మూర్ఖులు చేసిన పనుల వల్ల పార్టీ డ్యామేజ్ అవుతోందని.. ఈ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. దీంతో కేడర్‌లో విశ్వసనీయత పోతోందని.. అది ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరించారు. ఈ విషయంపై మీడియా ద్వారా సీఎం కేసీఆర్‌కు మెసేజ్ ఇస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం గుర్తించాలని కోరారు.

ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీపై మంత్రి రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్లుగా అన్ని పదవులు తానేమి తన్నుకుపోలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల భేటీకి పిలిచి ఉంటే తాను కూడా వెళ్లేవాడినని మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story