Komatireddy Rajagopal Reddy: రాజకీయ సన్యాసం తీసుకుంటా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2022-08-15 12:15:04.0  )
Komatireddy Rajagopal Reddy Challenges Minister Jagadish Reddy
X

దిశ, చౌటుప్పల్: Komatireddy Rajagopal Reddy Challenges Minister Jagadish Reddy| రాజీనామాతోనే మునుగోడులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గత మూడున్నరేళ్లుగా అసెంబ్లీలో కొట్లాడితే నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగానే గట్టుపల్ మండలాన్ని ఏర్పాటు చేసి, చౌటుప్పల్ నుండి రోడ్డు నిర్మాణ పనులను మాల్ మర్రిగూడ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారని అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేశానని అన్నారు. ఫామ్ హౌస్‌లో పడుకునే ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు వచ్చి మునుగోడు అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని తన రాజీనామాతోనే ఏర్పాటు చేశారని అన్నారు. గత ఎనిమిదిన్నరేళ్లుగా నల్లగొండ జిల్లాకు చెందిన మునుగోడు ప్రాంతంలోని ప్రాజెక్టులను పట్టించుకోకుండా భూనిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. నియోజకవర్గంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగమైన శివన్నగూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఇన్నేళ్లుగా వివక్షకు గురైన మునుగోడు ప్రాంత ప్రజలు తన రాజీనామాతో అభివృద్ధి పనులు కొనసాగుతాయనే ఆశతో ఉన్నారని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం కోసం తాను రాజీనామా చేశానని తిరిగి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి తనని గెలిపించాలని అన్నారు. మునుగోడు ప్రజల తీర్పు చారిత్రక అవసరమని అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నాడని ఆరోపించారు.

మంత్రి జగదీష్ రెడ్డి‌పై ఫైర్

తాను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే మంత్రి జగదీష్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డిది తనను విమర్శించే స్థాయి కాదని అన్నారు. 2014 తర్వాత ఆయన ఆస్తులు వెయ్యి కోట్లకు చేరుకున్నాయని వాటన్నిటినీ ఆధారాలతో సహా బయట పెడతానని అన్నారు. శంషాబాద్ ఏరియాలో 70 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని తెలిపారు. సొంత ఇల్లు కూడా లేని జగదీశ్ రెడ్డి అవినీతి సొమ్ముతో నేడు వేల కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి ఆస్తుల చిట్టా బయట పెడితే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం 2009 సంవత్సరం తర్వాత తన ఆస్తులను అమ్ముకున్నానని, అవినీతి కాంట్రాక్టు పనులకు తన కక్కుర్తిపడే వ్యక్తిని కాదని అన్నారు. రాజకీయంగా తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని ఉద్దేశంతో కొందరు వ్యవహరిస్తున్నారని వాటన్నిటినీ గమనించి ధర్మం వైపు నిలబడి నన్ను గెలిపిస్తారని అన్నారు. ఈనెల 21న మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. తనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: దేశం గర్వించే రీతిలో వజ్రోత్సవాల నిర్వహణ: ఎర్రబెల్లి

Advertisement

Next Story

Most Viewed