- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కాంలో రోజుకో ట్విస్ట్.. వెలుగులోకి ఎంపీ సంతోష్ రావు లింకులు?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఇక్కడి నుంచి నిధులు ఎలా మళ్లించారో తెలుసుకొనే పనిలో నిమగ్నమైంది. సోమవారం కరీంనగర్ లో ఈడీ విచారించిన వెన్నమనేని శ్రీనివాసరావుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగినట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది. పలు సంస్థల్లో వీరిద్దరూ డైరెక్టర్లుగా కొనసాగినట్టు గుర్తించింది. వెన్నమేనేని డైరెక్టర్ గా ఉన్న ఎట్ హోం హాస్పిటాలిటీలోనూ శ్రీనివాసరావుతో పాటు ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ డైరెక్టర్లుగా కొనసాగారు. 2014 అక్టోబర్ 4న ముగ్గురూ ఈ సంస్థ నుంచి వైదొలగటం గమనార్హం. ఈ లింకులపై ఈడీ ఆరా తీస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణను కుదిపేస్తున్నది. ఈ కుంభకోణంలో రాష్ట్రానికి చెందిన వారు కీలకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందినవారితో పాటు సీఎంతో , ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండే వారిపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇటీవల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆడిటర్ బుచ్చిబాబు ఆఫీసులో లభించిన పత్రాల ఆధారంగా కరీంనగర్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ బిల్డర్ వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని ఏడు గంటలపాటు ప్రశ్నించారు. పవిత్ర పైప్స్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్న వెన్నమనేని గతంలో జోగినపల్లి సంతోష్‌తోనూ వ్యాపార సంబంధాలు నెరిపినట్లు తెలిసింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అడ్రస్‌తో 2016 ఫిబ్రవరి 8న రిజిస్టర్ అయిన హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో వెన్నమనేనితో పాటు జోగినపల్లి సంతోష్, చెన్నమాధవును ప్రసాద్, చెన్నమాధవుని ప్రసన్న కుమార్ డైరెక్టర్‌లుగా ఉన్నారు. అప్పటికే సంతోష్ కుమార్ తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్, తెలంగాణ మీడియా సర్వీసెస్, తెలంగాణ ఎంటర్‌టైన్‌మెంట్, తెలంగాణ మార్కెటింగ్ సర్వీసెస్, ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ తదితర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు.
హైదరాబాద్ షాపింగ్‌లో డైరెక్టర్ అయిన తర్వాత కరోలినా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్‌లోనూ (2016 అక్టోబరు)లో డైరెక్టర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన 4 నెలలకు ఎట్ హోమ్ సంస్థ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కరోలినా సంస్థలోనూ తొమ్మిది నెలలకంటే ఎక్కువ కాలం కంటిన్యూ కాలేదు. రాజ్యసభ సభ్యుడిగా (2018 మార్చి 23న) ఎన్నిక కావడానికి ముందు అన్ని సంస్థల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్, మీడియా సర్వీసెస్, ఎంటర్‌టైన్‌మెంట్, మార్కెటింగ్ సర్వీసెస్ లాంటి సంస్థల నుంచి ఒకేరోజున (2018 మార్చి5)న వైదొలిగారు. అంత కన్నా రెండు రోజుల ముందే హైదరాబాద్ షాపింగ్ సంస్థ నుంచి వైదొలిగారు. దీంతో ఈ సంస్థలో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. వెన్నమనేని ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నందున గతంలో సంతోష్‌తో కలిసి నడిపిన వ్యాపారాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. వెలాసిటీ ఎడ్యుకేషన్ ప్రైవేటు లిమిటెడ్ 2015 డిసెంబరు 2 నుంచి ఉనికిలో ఉన్నా 2017 సెప్టెంబరులో వెన్నమనేని అందులో డైరెక్టర్‌గా చేరారు. ఈడీ దర్యాప్తులో భాగంగా వీటన్నింటి వివరాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. వెన్నమనేని శ్రీనివాసరావుతో వ్యాపార సంబంధం ఉన్న జోగినపల్లి సంతోష్ ఇప్పుడు ఏ కంపెనీలో డైరెక్టర్‌గా లేకపోయినా గతంలో ఆయన ఆ బాధ్యతలు నిర్వహించిన కంపెనీలపైనా ఈడీ దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి.
ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వెసెస్ కంపెనీలో సంతోష్‌తో పాటు కేటీఆర్, కవిత భర్త అనిల్ కూడా మొదట్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురూ 2014 అక్టోబరు 4న ఒకే రోజు సంస్థ నుంచి వైదొలిగారు. సంతోష్ డైరెక్టర్‌గా తప్పుకున్నా ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఉనికిలోనే ఉన్నాయి. వీటిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రారంభం నుంచీ తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే (2014 ఏప్రిల్ 1న) తప్పుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం మీద సీబీఐ దర్యాప్తుతో మొదలైన వ్యవహారం ఇప్పుడు ఈడీ, ఐటీ వరకూ పాకింది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడంతో తెలంగాణలోని డిస్టిలరీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో మొదలైన ఈడీ విచారణ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకూ, సన్నిహితంగా ఉండేవారి వరకూ చేరుకున్నది. లిక్కర్ స్కాంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసే టైమ్‌కు వెన్నమనేని శ్రీనివాసరావు సహా బోయిన్‌పల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్‌సాగర్, సూదిని సృజన్‌రెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు.. ఇలా వీరెవరి పేర్లూ లేవు. కానీ దర్యాప్తులో భాగంగా ఒక్కో లింకు వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతానికి వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ విచారిస్తూ ఉన్నందున దీనికి కొనసాగింపులో లింకులో ఇంకా ఎవరెవరి పేర్లు తెరమీదకు వస్తాయోననే చర్చలు జరుగుతున్నాయి. వెన్నమనేనితో వ్యాపార సంబంధం ఉన్నవారిని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అనేది ఒక అంశమైతే డబ్బులు ఏ కంపెనీ నుంచి ఎక్కడికి ఎలా బదిలీ అయ్యాయో, మనీ లాండరింగ్ ఏ స్థాయిలో జరిగింది, విమాన టికెట్ల మొదలు ఢిల్లీలో మద్యం దుకాణాలను టెండర్లలో దక్కించుకోడానికి వెళ్లిన ముడుపులు, హవాలా లావాదేవీలు... ఇవన్నీ ఇప్పుడు ఈడీ దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఈ నెల 6న ఈడీ సోదాలు చేసింది మొదలు రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు రెయిడ్ జరిగింది. రానున్న కాలంలో ఈడీ ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తుంది? తెరపైకి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఈడీ కదలికలపై రాష్ట్రం అంచనాలు తలకిందులు
Also Read : ఆ యాప్‌లో ఛాటింగ్? ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త కోణం