భారత్‌కు కేసీఆర్ వంటి విజనరీ లీడర్ షిప్ అవసరం: ఎంపీ కేశవరావు

by Satheesh |
భారత్‌కు కేసీఆర్ వంటి విజనరీ లీడర్ షిప్ అవసరం: ఎంపీ కేశవరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నాయకులంతా పరస్పర సమన్వయంతో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఎంపీ కేశవరావు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభను తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు బలం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, కార్యకర్తలేనన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయంలో కార్యకర్తలు గొప్ప పాత్ర పోషించారని, బీఆర్ఎస్ జెండాను నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ‘నేషనల్ మిషన్’తో ముందుకు సాగాలని సూచించారు. నాయకులు తమ లోపాలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలని, దేశానికి కేసీఆర్ విజనరీ లీడర్ షిప్ అవసరం అన్నారు.

కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారన్నారు. దేశమే అబ్బురపడేలా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం, 125 అడుగుల అంబేద్కర్, కొత్త సెక్రటేరియట్‌ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. నిన్నటి వరకు నదుల్లోని నీరు సముద్రంలో కలిసేవని, కానీ కేసీఆర్ పాలనలో నదులు పొలాలకు పారుతూ, ఇండ్లకు మళ్లుతూ సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయన్నారు. 75 ఏండ్లలో చేయలేని పనులను 9 ఏండ్లలో చేసి చూపించగలిగామన్నారు. మోడీ దేశాన్ని అదానీకి దోచిపెడుతుంటే, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి నిధులను మళ్లిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని జల వనరుల లభ్యతను, నదీ ప్రవాహాలను స్క్రీన్‌పై ఇంజనీర్‌లా సోదాహరణంగా వివరించిన కేసీఆర్ లాంటి వ్యక్తి మరొకరు లేరన్నారు.

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు, ప్రజారోగ్యంలో తెలంగాణ తెచ్చిన సంస్కరణలను పార్లమెంటు స్టాండింగ్ కమిటి ప్రశంసించిందన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరిచేందుకు చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలతో కేసీఆర్ కార్యకర్తల మనసు గెలుచుకున్నారన్నారు. వాళ్ల కష్టాలు, అవసరాలు తెలుసుకుని ముందుకు సాగుతున్న తీరుతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నదన్నారు. ప్రైవేటైజేషన్ కాదు నేషనలైజేషన్ కావాలన్న ప్రోగ్రెసివ్ లీడర్ సీఎం అని, బీఆర్ఎస్ పార్టీ దేశ వికాసమే లక్ష్యంగా నికార్సైన ఎజెండాతో ముందుకు సాగుతున్నదన్నారు.

Advertisement

Next Story

Most Viewed