చెల్లి విషయంలో కేటీఆర్ సైలెంట్ ఎందుకు?

by Sathputhe Rajesh |
చెల్లి విషయంలో కేటీఆర్ సైలెంట్ ఎందుకు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవిత పూర్తిగా బురదలో కూరుకుపోయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్, ఆయన కుటుంబీకులకు సంబంధం ఉందని ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అత్యంత పెద్ద పెద్ద స్కాముల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందన్నారు. ఆయన తరచూ పంజాబ్ కి వెళ్లి రైతులకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తున్నా అని చెప్పుకుంటూ.. తిరిగేది కేవలం ఇలాంటి కుంభకోణాల కోసమేనని చెప్పారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కలవడం, బీఆర్ఎస్, నేషనల్, ఫెడరల్ ఫ్రంట్ వెనుక ఉన్న మతలబు ఇదేనని, ప్రజలను ముంచడమే వారికున్న పని అని వెల్లడించారు. కేసీఆర్ తెలంగాణను ముంచింది సరిపోలేదన్నట్లుగా ..ఆప్ పార్టీని కూడా భ్రష్టు పట్టించారన్నారు. ఫ్లయిట్లు, హోటల్ గదులు బుక్ చేసుకుంటూ కేసీఆర్ సమావేశాలను కోఆర్డినేట్ చేసుకుంటూ తన తండ్రి అవినీతిలో కవిత ఇన్ వాల్వ్ అయిందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశంలో సీబీఐ ఎంక్వైరీ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హస్తం ఉన్నట్లుగా తెలుస్తోందని అర్వింద్ పేర్కొన్నారు. లిక్కర్ పాలసీ రూపొందించే సమయంలో కవిత జెట్ ఫ్లయిట్లలో వెళ్లి మరీ ఇక్కడి కంపెనీలతో అక్కడ కంపెనీలను ఆక్యుపై చేయించుకుందని ఆరోపణలు చేశారు.

ఢిల్లీలో 32 జోన్లలో 849 రిటైల్ లైసెన్సులుంటే.. కొత్త పాలసీ రాకముందు 475 షాపులు ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వహణ సాగిస్తుండేవని ఆయన వెల్లడించారు. కానీ కొత్త పాలసీ వచ్చి పూర్తిగా 800కు పైగా దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లాయన్నారు. హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ కమీషన్ కూడా 2 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారని అర్వింద్ పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో ఈ పాలసీ రావడంతో టెండర్లలో 140 కోట్ల స్కామ్ జరిగిందని అర్వింద్ తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల 19-20 సంవత్సరంలో రూ.4,200 కోట్లు, 20-21 లో రూ.3,300 కోట్లకు ఆదాయం పడిపోయిందన్నారు. ఇప్పుడు ఫీజు తగ్గించడం వల్ల ఆదాయం రూ.180 కోట్లకు పడిందని వెల్లడించారు. ఆప్ ప్రభుత్వం మొత్తంగా ఆరున్నర వేల కోట్లకు టోపీ పెట్టిందని అర్వింద్ ఆరోపణలు చేశారు. లిక్కర్ మాఫీయాతో కవిత చేతులు కలిపిందని, దేశాన్ని దోచుకుందామన్న తండ్రీ, కూతుళ్ల ప్లాన్ ఇవ్వాళ బయటపడిందన్నారు.

కవిత మొత్తం బురదలో కూరుకుపోయిందని, కానీ ఆమె కడిగిన ముత్యంలాగా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. కవిత నడిపే బ్యూటీ పార్లర్ డైరెక్టర్ అభిషేక్ పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉందని అర్వింద్ వెల్లడించారు. కొద్దినెలల నుంచి కవిత కనిపించకుండా పోయిందని, దేశ, విదేశాల్లో తిరుగుతోందన్నారు. కోట్లాది రూపాయలు తీసుకెళ్లి తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ మెన్లకు ఉత్తరాదిలో వ్యాపారాలు ఏర్పాటు చేయించిందని అర్వింద్ విమర్శలు చేశారు. ఆమె సొంత పార్ట్ నర్ షిప్ ను బినామీ పేర్ల మీద పెట్టించి పూర్తిగా అవినీతిలో కవిత కూరుకుపోయిందని పేర్కొన్నారు. ఇందులో కేసీఆర్ హస్తం కూడా ఉందని, ఈ మొత్తం కుటుంబం రాష్ట్రానికే కాదు.. దేశానికే చీడపురుగులా తయారైందని విమర్శలు చేశారు. పంజాబ్ రైతులను ఉద్ధరించేది కేవలం పేరుకేనని ఫైరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతానని అంటున్నారని, అది లిక్కర్ ఫ్రంటా? ఫెడరల్ ఫ్రంటా? అనేది కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తన చెల్లెలు ఎమ్మెల్సీ కవిత విషయంలో మంత్రి కేటీఆర్ ఎందకు స్పందించడం లేదని అర్వింద్ ప్రశ్నించారు. ఫీనిక్స్ సంస్థపై జరిగే దాడుల్లో కేటీఆర్ బండారం బయటపడనుందని, అందుకే ఆయన స్పందించడం లేదని, సైలెంట్ అయ్యారని చురకలంటించారు. ఫీనిక్స్ నుంచి జాగృతి ఫౌండేషన్ కు నిధులు వెళ్లినట్టు తమకు సమాచారం ఉందన్నారు. సీబీఐ దర్యాప్తులో కవిత ముద్దాయిగా తేలుతుందని అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. సరైన సాక్ష్యం ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని అర్వింద్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత ప్రైవేట్ జెట్ ఎందుకు బుక్ చేసిందో, ఒబెరాయ్ హోటల్లో ఎందుకు ఉందో సమాధానం చెప్పాలన్నారు. ఇక రాజాసింగ్ విషయంలో స్పందించిన అర్వింద్ ఆయన పెట్టిన వీడియోను తాను చూడలేదన్నారు. పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉండొచ్చని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story