రైతు రుణమాఫీకి పైసలు రెడీ! ఖజానాలో ఉన్న మొత్తం ఎంతంటే..?

by Rajesh |
రైతు రుణమాఫీకి పైసలు రెడీ! ఖజానాలో ఉన్న మొత్తం ఎంతంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు రుణమాఫీకి కావాల్సిన నిధులను ప్రభుత్వం దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో సుమారు రూ. 15 వేల కోట్ల నిధులు రిజర్వులో ఉన్నట్లు సమాచారం. పంద్రాగస్టు నాటికి మరో రూ. 9 వేల కోట్లను సమీకరించేందుకు అరేంజ్‌మెంట్స్ చేస్తున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన మరుక్షణమే రైతుల అకౌంట్స్‌లో ఈ నిధులను జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అవసరమైతే ఈ నెలాఖరు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ విధివిధానాలు తయారు చేసిన తర్వాత.. ఆ ఖర్చు కొంతమేరకు తగ్గే అవకాశమున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

అప్పును పొదుపు చేసి..

ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి సేకరించిన రుణాలను ఇతర ఖర్చుల కోసం ఉపయోగించకుండా, ఆ మొత్తాన్ని పక్కనపెట్టినట్టు తెలిసింది. ఒక్కపైసా ఖర్చు చేయకుండా, కేవలం రుణమాఫీ కోసం ఓ ప్లాన్ ప్రకారం వాటిని బ్యాంకుల్లో దాచినట్టు సమాచారం. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం 2024–25ఆర్థిక సంవత్సరానికి మొదటి ఆరు నెలల కోసం ఆర్బీఐ రూ. 29 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ సొమ్ము మొత్తాన్ని రుణమాఫీ కోసమే వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రభుత్వవర్గాల్లో ప్రచారం ఉంది.

భూములు అమ్మకుండానే..

రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కార్పొరేషన్ కింద తీసుకునే ప్రతి పైసా రుణం ఎఫ్ఆర్బీఏం పరిధి కిందనే ఆర్బీఐ జమ కట్టనుందని తేలింది. దీంతో కార్పొరేషన్ ఏర్పాటు వల్ల అదనపు ప్రయోజనం లేదని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం సర్కారు భూములను విక్రయించాలని భావించింది. అయితే భూముల విక్రయంతో రుణమాఫీకి కావాల్సిన నిధుల సమీకరణ కష్టమని నిపుణులు చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నది. చివరికి ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలను తీసుకోవాలనే ప్రతిపాదన సైతం తెరమీదికి వచ్చింది. అలా చేస్తే ప్రభుత్వం పరువు పోతుందేమోననే అనుమానంతో ఆ ప్రతిపాదనను సైతం పక్కన పెట్టారు. చివరికి ఎఫ్ఆర్బీఎం చట్టం మేరకు రాష్ట్రం తీసుకునే అప్పుతోనే రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

రూ. 29 వేల కోట్లు రెడీ!

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 13 వేల కోట్లను సేకరించింది. ఈ రెండుమూడు రోజుల్లో మరో రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వ ఖజానాలో రూ. 15 వేల కోట్లు ఉండనున్నాయి. రెండో త్రైమాసకంలో మరో రూ. 14 వేల కోట్ల అప్పు చేసేందుకు ప్రభుత్వానికి వెసులు బాటు ఉంది. అందులో రూ. 9 వేల కోట్లను ఆగస్టు 15లోపు తీసుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వం వద్ద రూ. 24 వేల కోట్ల మేరకు నిధులు ఉంటాయి. ఒకవేళ అవసరమైతే మిగతా రూ. 5 వేల కోట్ల రుణాన్ని కూడా ఆగస్టు 15 లోపే తీసుకొని రుణమాఫీ కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed