నేడు తెలంగాణకు మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

by Rajesh |
నేడు తెలంగాణకు మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం వడివడిగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అల్లాదుర్గ్‌లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే విషయాలను ప్రస్తావించనున్నారు.

ఇదిలా ఉండగా మే 3, 4 తేదీల్లోనూ మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారని తొలుత పార్టీ వర్గాలు వెల్లడించాయి. 3న వరంగల్, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో, 4న మహబూబ్‌నగర్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేస్తారని చెప్పారు. కానీ.. 3, 4 తేదీల్లో ఉండాల్సిన మోడీ టూర్ వాయిదా పడింది. మే 8, 9 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారని విశ్వసనీయ సమాచారం. కాగా, మే 8న కరీంనగర్ పార్లమెంట్ పరిధి వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలుస్తోంది. పర్యటనలో భాగంగా వేములవాడ రాజన్నను మోడీ దర్శించుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలుస్తోంది.

మోడీ షెడ్యూల్ ఇదే..

ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్ ద్వారా జహీరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. సభ అనంతరం 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయమవ్వనున్నారు.

ఇదిలాఉండగా వచ్చే నెల 1న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న సైతం నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా ఆ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed