MLC Kavitha: లిక్కర్ స్కాంలో కవితే ప్రధాన సూత్రధారి..! ఈడీ కస్టడీ పిటిషన్‌లో ఆసక్తికర విషయాలు

by Shiva |   ( Updated:2024-03-17 12:38:38.0  )
MLC Kavitha: లిక్కర్ స్కాంలో కవితే ప్రధాన సూత్రధారి..! ఈడీ కస్టడీ పిటిషన్‌లో ఆసక్తికర విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేసులో కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించి శనివారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు వారం రోజుల రిమాండ్ విధించింది. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితదే కీలక పాత్ర అని అధికారులు అభియోగం మోపారు. కేసులో ఎక్కడ తాను దొరికిపోతానోనని కీలక ఆధారాలను సైతం నాశనం చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందజేశారు

ఈ మొత్తం స్కాంలో కవిత ఇతర వ్యక్తులతో కలిసి రూ.100 కోట్ల అవినీతికి కుట్ర పన్నినట్లు ఈడీ తన కస్టడీ పిటిషన్‌లో ప్రస్తావించింది. బ్యాంకు లావాదేవీల్లో కవిత అన్ని తానై వ్యవహరించిందని పేర్కొ్న్నారు. ఇండో స్పిరిట్స్‌ని తన గుప్పిట్లో పెట్టుకుని తద్వారా రూ.192.8 కోట్ల అక్రమంగా డబ్బు ఆర్జించిందని అభియోగం మోపింది. 2021-22 మద్యం పాలసీ అమలులో చట్టవిరుద్ధంగా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు లంచం కూడా ఇచ్చినట్లుగా తేలింది. అరుణ్‌ పిళ్లై అనే బినామీ ద్వారా ఇండో స్పిరిట్స్‌లో ఆమె భాగస్వామిగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడిని ఆధారంగా చేసుకుని అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించేందకు ఆమె ప్రయత్నించిందంటూ ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

వాస్తవానికి కవిత రూ.100 కోట్ల పీవోసి బదిలీలో ఆమె సిబ్బంది, సహచరులు అభిషేక్‌ బోయిన్‌పల్లి, బుచ్చిబాబుతో కలిసి ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులకు చెల్లించిందని ఈడీ వివరించింది. అదేవిధంగా లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో అంతర్గతంగా కవిత పాల్గొందని అధికారులు ప్రస్తావించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు సౌత్‌ గ్రూప్‌లోని సభ్యులు శరత్‌‌రెడ్డి, మాగుంట రాఘవ్‌ శ్రీనివాసుల రెడ్డి ఆప్‌ అగ్ర నేతలతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. అందుకు రూ.100 కోట్లు వరకు అక్రంగా చెల్లించి.. ప్రతిఫలంగా ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ అమలులో అక్రమంగా లబ్ధి పొందారని ఈడీ తమ కస్టడీ పిటిషన్‌లో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed