వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

by Sridhar Babu |
వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, బీర్ పూర్ : భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య , బక్కెనపల్లి అరుణ్, యశోద శ్రీనివాస్, సైదు సహదేవ్, రత్నం మాణిక్యం, ముకునూరి కిరణ్ కుమార్ ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. వీరు కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రంతో గుప్త నిధుల కోసం వెతుకుతున్నారు. ఎక్కడా గుప్త నిధులు దొరకకపోవడంతో పై వారందరూ కలిసి బాగా డబ్బులు ఉన్న వారి ఇంట్లో దోపిడీ చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేద్దామనుకున్నారు. తుమ్మెనల దగ్గర గల సహదేవ్ హోటల్లో కలిశారు. బీర్పూర్ లో డబ్బులు, బంగారం ఉన్న వ్యాపారి కాసం ఈశ్వరయ్య ఇంట్లో అతడు, అతని భార్య మాత్రమే ఉంటారని, వాళ్ల ఇంట్లో చొరబడి దోపిడీ చేస్తే డబ్బు, బంగారు ఆభరణాలు దొరుకుతాయని పథకం వేశారు. గత శుక్రవారం రాత్రి అందరూ కలిసి తుమ్మెనాల దగ్గర గల సహదేవ్ హోటల్లో కలుసుకొని మంకీ క్యాప్ లు ధరించి బొమ్మ తుపాకీలు పట్టుకొని కిరణ్ కుమార్, అరుణ్, తులసయ్య, మున్నేసుల శ్రీనివాస్ కలిసి ఒక నెంబర్ లేని వైట్ కలర్ స్కూటీ, బ్లాక్ కలర్ ఫ్యాషన్ ప్రో బైక్ ల మీద బీర్పూర్ కి వెళ్లి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కాసం ఈశ్వరయ్య ఇంటి వెనకాల నుండి గోడ దూకి బాత్రూమ్ లోకి వెళ్లి దాచుకొని ఉన్నారు. ఉదయం ఐదు గంటలకు వ్యాపారి ఈశ్వరయ్య బాత్రూమ్ కి వెళ్లడానికి రాగా అతనిని గట్టిగా అధిమి పట్టి బొమ్మ తుపాకీతో తల మీద కొట్టి చంపుతామని బెదిరించి ఇంట్లోకి ఈడ్చుకెళ్లారు.

అతని భార్యను కూడా కొట్టి దుస్తులు నోట్లో కుక్కి వారిని కట్టేశారు. వారి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడీ చేసుకొని అక్కడి నుండి ఫారెస్ట్ మార్గం ద్వారా పారిపోయి తుమ్మెనలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సహదేవ్, రత్నం మాణిక్యం వేచి ఉన్నారు. అందరూ కలిసి పారిపోవాలని ప్లాన్​ వేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశానుసారం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం లో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు నిందితులు ధర్మపురి మండలంలోని తుమ్మెనలగుట్ట దగ్గర ఉన్నారని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు సహదేవ్ హోటల్ దగ్గర ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.

పట్టుబడ్డ నిందితులు మునియాల్ కు చెందిన శ్రీనివాస్, చిప్ప బత్తుల తులసయ్య , లక్షట్ పేట్ కు చెందిన బక్కినపల్లి అరుణ్, గుట్రాజ్ పల్లికి చెందిన యశోద శ్రీనివాస్, బీర్పూర్ కు చెందిన సైదు సహదేవ్, అనంతరంనకు చెందిన రత్నం, మురమడుగులకు చెందిన మాణిక్యంను అరెస్టు చేశారు. మరో నిందితుడు మంచిర్యాలకు చెందిన ముకునూరి కిరణ్ కుమార్ పరారీలో ఉన్నాడు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద గోల్డ్ బ్రాస్లెట్ చైన్ ,పుస్తెలతాడు, గోల్డ్ రింగ్, రెండు తులాల చైన్, పది వేల నగదు ,ఆరు స్మార్ట్ ఫోన్లు, పల్సర్ బైక్, బొమ్మ తుపాకీలు రెండు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించి నేరస్తులను పట్టుకోవడంలో పాల్గొన్న సీఐ వై.కృష్ణారెడ్డి, ఎస్సైలు కుమారస్వామి, సుధాకర్, శ్రీధర్ రెడ్డి, దత్తాత్రి,హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుల్స్ గంగాధర్, శ్రీనివాస్, వెంకటేష్, ముత్తయ్య, సుమన్, రవి, రమేష్ నాయక్, లింగారెడ్డి, శివ, పరమేష్ జలంధర్, టెక్నికల్ సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి ప్రోత్సాహకం అందించారు.

Advertisement

Next Story

Most Viewed