ముగిసిన MLC ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపు మాదే అంటున్న కాంగ్రెస్

by Disha Web Desk 2 |
ముగిసిన MLC ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపు మాదే అంటున్న కాంగ్రెస్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 99.86% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను అధికారులు 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లలో 1439కి మందికి గాను 99.86%తో 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట, నాగర్ కర్నూల్ పోలింగ్ కేంద్రాలలో ఇద్దరు ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మహబూబ్ నగర్ లో 245, వనపర్తి లో 218, గద్వాలలో 225 , కొల్లాపూర్ లో 67, అచ్చంపేటలో 79, కల్వకుర్తిలో 72 మంది, షాద్నగర్ లో 171 మంది ఓటర్లు అందరూ (100%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నాగర్ కర్నూల్ లో 101 మందికి 100మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. నారాయణపేటలో 205 మందికి 204 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్కరు తమ ఓటును వినియోగించుకోలేదు. కాగా, కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని బట్టి గెలుపు పట్ల కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.


Next Story

Most Viewed