నేను ముస్లిం ఓట్లు అడగను.. దమ్ముంటే OYC నాపై పోటీ చేయాలి: రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-10-18 15:28:20.0  )
నేను ముస్లిం ఓట్లు అడగను.. దమ్ముంటే OYC నాపై పోటీ చేయాలి: రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను ముస్లింలను ఓట్లు అడగబోనని, వాళ్ళు తనకెలాగూ ఒట్లేయరని, వారి ఓట్లు తనకు అవసరం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి దమ్ముంటే తనపై పోటీకి దిగాలని ఆయన సవాల్ చేశారు. తనపై పోటీకి అన్న వచ్చినా? తమ్ముడు వచ్చినా తాను సిద్ధమేనని, వారికి ఒక్క ఓటు కూడా పడనివ్వబోనని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీలకు లేదని ఎద్దేవాచేశారు.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర ఒవైసీలదని ఘాటు విమర్శలు చేశారు. అభ్యర్థులను నిలబెట్టి బ్లాక్ మెయిల్ దందాలు మొదలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్పితే.. ముస్లిం వర్గాలు కాదని ఆయన ఫైరయ్యారు. గోషామహల్ నుంచి పోటీ చేసే అభ్యర్థులతో ఓవైసీ.. బిజినెస్ చేస్తాడని ఆరోపించారు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు నిలబడాలో ఎంఐఎం పార్టీ ఆఫీస్ నుంచే డిసైడ్ అవుతుందన్నారు. 2014 ఎన్నికల్లో ముఖేష్ గౌడ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఒవైసీ డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు చేశారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా దారుస్సలాం నుంచే డిసైడ్ చేశారని తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా దారుస్సలాం నుంచే అభ్యర్థి ఎంపిక ఉంటుందని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. దారుస్సలాంకు డబ్బుల సంచులు వెళ్తే అభ్యర్థి ఎంపిక అయిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ.. పెద్ద బిజినెస్ మేన అని ఆయన తెలిపారు. ఇంకా ఎంత డబ్బు సంపాదించుకుంటారని ఆయన ప్రశ్నించారు. గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని పెట్టడానికి దమ్ములేదా అని రాజాసింగ్ సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed