ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

by Satheesh |   ( Updated:2023-02-17 07:50:27.0  )
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను జస్టిస్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాను ధర్మాసనం ముందు ఉంచారు.

ఈ కేసును ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తోందని, ఈ కేసులో ఆధారాలన్ని కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితిలో ఈ కేసు విచారణను సీబీఐకి ఎలా అప్పగిస్తారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు ఎక్కువ సమయం కావాలని కోరారు. కాగా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా ఈ కేసులో విచారణ నిమిత్తం దస్త్రాలు తమకు అప్పగించాలని ఇప్పటికే సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 5 సార్లులేఖలు రాసింది. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు ఈ కేసును కీలక మలుపు తిప్పబోతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27పై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story