మంత్రి అవ్వడం కోసం మల్లారెడ్డి రూ.100 కోట్ల ఖర్చు: మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-10-10 11:33:44.0  )
మంత్రి అవ్వడం కోసం మల్లారెడ్డి రూ.100 కోట్ల ఖర్చు: మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి మల్లారెడ్డికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి.. మంత్రి మల్లారెడ్డిపై తాజాగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మల్లారెడ్డి పెద్ద అవినీతి పరుడని, ఆయన మంత్రి మల్లారెడ్డి కాదు.. కబ్జాల మల్లారెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి కాలేజీలు అన్ని చెరువులోనే ఉన్నాయని, రూ.100 కోట్ల ఖర్చు పెట్టి ఆయన మంత్రి అయ్యాడని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు కాలం చెల్లిందని మల్కాజ్ గిరిలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 30 శాతం కమిషన్ల కోసమే బీఆర్ఎస్ పథకాలు తీసుకు వచ్చిందన్నారు.

ఇదిలా ఉంటే బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక ఆనంద్‌ను ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. హారిక భర్త ఆనంద్ మైనంపల్లి హన్మంతరావు అనుచరుడిగా ఉన్నారు. ఈ కారణం వల్లే అతడిపై చర్యలు తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌లో ఉన్న నాటి నుంచే మంత్రి మల్లారెడ్డికి మైనంపల్లికి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మైనంపల్లి బీఆర్ఎస్‌లో ఉండగానే మల్లారెడ్డి టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన నియోజకవర్గానికే పదవులుంటే సరిపోతుందని మల్లారెడ్డి భావిస్తున్నారని, మేడ్చల్‌లో కూడా సీనియర్లకు, అర్హులకు పదవులను ఇవ్వలేదని ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో మల్కాజ్ గిరి బీఆర్ఎస్ టికెట్ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి టార్గెట్‌గా మైనంపల్లి విమర్శల దాడి పెంచారు.

Advertisement

Next Story

Most Viewed