ఆ విషయం అప్పుడే మర్చిపోతే ఎలా?.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

by Gantepaka Srikanth |
ఆ విషయం అప్పుడే మర్చిపోతే ఎలా?.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాలనలో ఓటు బ్యాంకు రాజకీయాలతో రైతులను మోసగించిన బీఆర్ఎస్(BRS) నేతలు ఇప్పుడు దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు(Rythu Bandhu) పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను 'రైతు భరోసా'(Rythu Bharosa) పథకంతో సరిదిద్ది రైతులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా అభినందించాల్సింది పోయి అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టడం ఎంత వరకు సమంజసమని మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

పదేళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి సేకరించిన భూములకు, సాగులో లేని రాళ్ల గుట్టలకు 'రైతు బంధు' పేరిట దోచి పెట్టిన ఘనత మీకే దక్కిందంటూ ఎద్దేవా చేశారు. 2018-19 నుంచి 2022 2023 వరకు రూ.25,672 కోట్ల నిధులను సాగులో లేని భూములకు చెల్లించారు. ఒక్కసారి వెనక్కి తిరిగి, మీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసుకోవాలని శ్రీధర్ బాబు హితవు పలికారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని వివరించారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల ఉసురు తగిలే, మీరు అధికారం కోల్పోయారని గుర్తుంచుకోవాలన్నారు. 2014-2022 వరకు తెలంగాణాలో 6,121 మంది అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని మర్చి పోతే ఎలా ఆయన ప్రశ్నించారు.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ బలవన్మరణాల అంకెలను 2022 లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు గా నిలిచి మీరు చేసిన పాపాలను కడుక్కో వాలని శ్రీధర్ బాబు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు అప్పుల కుప్పగా మార్చి దిగిపోయినా రైతులకు ఇచ్చిన మాట మేరకు ఏక కాలంలో రూ. 21 వేల కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు. మీడియాలో కనిపించడం మానుకుని ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యేందుకు ప్రయత్నించాలని శ్రీధర్ బాబు హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed