Minister Seethakka: గత ప్రభుత్వమే కమీషన్ల సర్కారు.. మంత్రి సీతక్క ఫైర్

by Shiva |
Minister Seethakka: గత ప్రభుత్వమే కమీషన్ల సర్కారు.. మంత్రి సీతక్క ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వమే కమీషన్ల సర్కార్ అని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థల‌కే నైపుణ్య బాధ్యత‌లు తాము అప్పగించామని మంత్రి సీత‌క్క ఫైర్ అయ్యారు. గ్రామీణ యువతకు నైపుణ్యం కల్పించడం కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేయూ) స్కీం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతంగా కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం అని తెలిపారు. అయితే, ఈ స్కీంలో అవ‌క‌త‌వ‌కలు జ‌రిగాయన్నట్లుగా ఓ యూట్యూబ్ ఛానెల్ కుట్రపూరిత‌మైన క‌థ‌నాన్ని ప్రసారం చేయడం సరి కాదన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని.. కనీసం కేంద్ర, రాష్ట్రాల నిధుల వాటా మీద, స్కీం అమ‌లు, నిధుల విడుద‌ల విధానం ప‌ట్ల ఏ మాత్రం అవ‌గాహ‌న లేకుండా విషం చిమ్మడ‌మే ప‌నిగా క‌థ‌నం న‌డిపారని ధ్వజమెత్తారు.

ఆంధ్రాకు చెందిన సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెట్ అనే బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి రూ.33 కోట్లు క‌ట్టబెట్టేందుకు ప్రయ‌త్నాలు సాగుతున్నాయంటూ అసత్య ప్రచారం చేశారని వివరించారు. నైపుణ్య శిక్షణ కోసం సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెట్ అనే ఏజెన్సీని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ గుర్తించగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంపిక చేసిందని గుర్తు చేశారు. మొత్తం 6,600 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రూ.55.19 కోట్ల నిధుల‌ను స‌ద‌రు సంస్థకు కేటాయించిందని పేర్కొన్నారు. 2220 మంది యువ‌త‌కు నైపుణ్య శిక్షణ ఇచ్చినందుకు గాను గ‌త ప్రభుత్వం స‌ద‌రు సాహితి సిస్టమ్స్ సంస్థకు రూ.18.43 కోట్లు చెల్లించిందన్నారు. చివ‌ర‌గా ఆగ‌స్టు 31, 2023లో రూ.4.85 కోట్లు పేమెంట్ చేసిందన్నారు.

నిజంగా బ్లాక్ లిస్టేడ్ కంపెనీ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు రూ.18.43 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు? క‌మీష‌న్ల గురించి మాట్లాడేవారు వారెంత క‌మీష‌న్ తిన్నారో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంలో ఎంపిక చేసిన కంపెనీలే ఇప్పటికీ కొన‌సాగుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం ఒక్క కొత్త ఏజేన్సీకి కూడా నైపుణ్య శిక్షణ బాధ్యత‌లు క‌ట్టబెట్ట లేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం కింద త‌న వాటా నిధుల‌ను ఇచ్చినా గ‌త ప్రభుత్వం త‌న వాటా నిధుల‌ను కేటాయించ లేదని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్ల ఏప్రిల్ 1, 2022 నుంచి 30 న‌వంబ‌ర్ 2023 వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో స్కీం డెవ‌ల‌ప్‌మెంట్ స్కీంను నిలిపి వేసిందన్నారు.

కానీ, తమ ప్రభుత్వం వ‌చ్చాక నిరుద్యోగ యువ‌త‌కు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌రిచేలా కేంద్రాన్ని ఒప్పించి ఆ స్కీంను రాష్ట్రంలో తిరిగి కొన‌సాగేలా చ‌ర్యలు చేప‌ట్టిందని వివరించారు. ఈ నేప‌ధ్యంలో గ‌త ప్రభుత్వం‌లోనే ఎంపిక చేయ‌బ‌డిన 23 ఏజెన్సీల‌కు రూ.16 కోట్ల నిధుల‌ను కేటాయించాల‌ని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీతక్క అన్నారు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవని పూర్తి పార‌ద‌ర్శక‌త‌తోనే ఆ ప్రక్రియ కొన‌సాగుతోందని అన్నారు. యువ‌త‌కు అవ‌కాశాలు క‌ల్పించే ప్రయ‌త్నాలు తమ ప్రభుత్వం చేస్తుంటే.. మ‌సిపూసి మారేడు కాయ చేస్తూ ప్రజ‌ల‌ను గంద‌రగోళంలో పడేస్తు్న్నారని అన్నారు. రూ.33 కోట్ల నిధుల‌ను బ్లాక్ లిస్టెట్ సాహితి సిస్టమ్స్ సంస్థకు క‌ట్టబెట్టబోతున్నార‌ంటూ బురద చ‌ల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువ‌త‌ నైపుణ్య శిక్షణ కోసం మొత్తం 23 ఏజెన్సీల‌కు రూ.16 కోట్ల నిధుల‌ను కేటాయించాల‌ని తాము ప్రయ‌త్నిస్తుంటే వారి నైపుణ్య శిక్షణను అడ్డుకునేలా యూట్యూబ్‌ చానళ్ల ద్వారా బీఆర్ఎస్ బుర‌ద చ‌ల్లే ప్రయ‌త్నం చేస్తోందన్నారు. కేంద్ర నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే విడ‌త‌ల వారీగా నిధులు విడుద‌ల అవుతాయని 2019 నుంచి 2025 వ‌ర‌కు తెలంగాణ‌లో 90 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం రూ.817 కోట్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్ఎస్ హ‌యంలో రూ.185 కోట్లు ఖ‌ర్చు అయిందని తెలిపారు. ఆ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజురు చేయ‌క‌పోవ‌డం, నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో కేంద్రం ఏడాది పాటు ఈ స్కీంను మ‌న రాష్ట్రంలో నిలిపివేసిందని గుర్తు చేశారు. అందుకే నిధుల విడుద‌ల విషయంలో తాము ఆచితూచి అడుగులు వేస్తుందని అన్నారు. గ్రామీణాభివృద్ది శాఖలో ప్రత్యేకంగా క‌మిటి వేసి ఆ స్కీంను అమ‌లు చేస్తుందని, ఆ విషయాన్ని గమనించి వ్యవ‌హ‌రిస్తే బాగుంటుందని సీతక్క హితువు పలికారు.

Advertisement

Next Story

Most Viewed